Bhartha Mahasayulaku Wignyapthi Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ.. రవితేజ మార్క్ కామెడీ వర్కవుట్ అయ్యిందా?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా.. సునీల్, వెన్నెల కిశోర్, సత్య, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
Details
కథ
రామ్ సత్యనారాయణ (రవితేజ) 'అనార్కలి' పేరుతో వైన్ తయారు చేస్తుంటాడు. తన వైన్ శాంపిల్‌ను స్పెయిన్‌లోని ఓ పెద్ద కంపెనీకి పంపితే అది రిజెక్ట్ అవుతుంది. అసలు కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్ అక్కడి కంపెనీ ఎండీ మానసా శెట్టి (ఆషికా రంగనాథ్)కు దగ్గరవుతాడు. ఒక సందర్భంలో ఇద్దరూ ఒక్కటవుతారు. ఇక రామ్ భార్య బాలామణి (డింపుల్ హయతి) మాత్రం.. మగాళ్లు ఎలా ఉండాలనేది చెప్పేందుకు తన భర్తే రోల్ మోడల్ అంటూ అందరికీ గొప్పగా చెబుతుంటుంది. భార్యను మోసం చేశానన్న బాధతో రామ్ లోపల లోపల నలిగిపోతుంటాడు. ఇదే సమయంలో వైన్ ఫెస్టివల్ కోసం మానస ఇండియాకు వస్తుంది. అప్పుడే రామ్ పెళ్లైన విషయం ఆమెకు తెలుస్తుంది.
Details
ప్రతి కథలోనూ ఒక కోర్ ఎమోషన్
అనంతరం మానస ఏం చేసింది? భార్య బాలామణి, మరో మహిళ మానస మధ్య రామ్ ఎలా ఇరుక్కుపోయాడు? ఇద్దరికీ నిజం తెలిసిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? చివరకు కథ ఏ మలుపు తిరిగింది? అన్నదే సినిమా కథ. సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ అన్న తేడా లేకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగలిగిందా? లేదా? అనేదే అసలు అంశం. ప్రతి కథలోనూ ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. అదే సినిమాను ముందుకు నడిపిస్తుంది. ఎంత కామెడీ ఉన్నా ఎమోషన్ మిస్ అయితే సినిమా బోల్తా పడుతుంది. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విషయంలో అదే లోపం కనిపిస్తుంది. సినిమా ప్రారంభం బాగానే ఉంటుంది.
Details
ఆసక్తికరంగా కథ
స్పెయిన్ ఎపిసోడ్‌లో ఆషికా రంగనాథ్ గ్లామర్ హైలైట్ అవుతూ, సత్య-వెన్నెల కిశోర్ కామెడీతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే కథ ఇండియాకు మారిన తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. మగాళ్లు ఎలా ఉండాలనేది చెప్పేందుకు బాలామణి తన భర్తనే ఎందుకు రోల్ మోడల్‌గా చూపుతుందో స్పష్టత లేకపోవడంతో.. భర్తలో వచ్చే భయం, ఆందోళన ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కావు. ఆ పరిస్థితుల నుంచి పుట్టాల్సిన కామెడీ కూడా వర్క్ అవ్వదు. దర్శక-రచయితగా కిశోర్ తిరుమలకు అభిమానులు ఉన్నారు. 'చిత్రలహరి'లో మెట్రో సన్నివేశంలో వచ్చే భావోద్వేగ డైలాగులాంటి డెప్త్ ఈ సినిమాలో కనిపించదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ కథకు కీలకం అయినప్పటికీ, ఆ రెండు చోట్ల ఎమోషన్ సరిగా పండలేదు.
Details
రీమిక్స్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు
అయితే కామెడీ విషయంలో మాత్రం కిశోర్ తిరుమల తన మార్క్ చూపించారు. సత్య, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు బాగా రాసుకున్నారు. పాటల్లో 'బెల్లా బెల్లా...' సాంగ్ పిక్చరైజేషన్ ఆకట్టుకుంటుంది. ఇందులో రవితేజ, ఆషికా రంగనాథ్ హుషారుగా స్టెప్పులు వేశారు. కానీ పాటలకు సరైన ప్లేస్‌మెంట్ లేకపోవడంతో 'ఇప్పుడు ఈ పాట ఎందుకు?' అన్న భావన కలుగుతుంది. పబ్‌లో వచ్చే రీమిక్స్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. సత్యపై షూట్ చేసిన ఓ పాటను ఎందుకు తొలగించారో అర్థం కాదు. భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ పూర్తి స్థాయి గుర్తింపు దక్కడం కష్టం. సినిమాటోగ్రఫీ మాత్రం కలర్‌ఫుల్‌గా ఉంది.
Details
కామెడీతో నవ్వించిన వెన్నెల కిశోర్, సునీల్
కథలోని రిచ్‌నెస్ తెరపై కనిపిస్తుంది. రవితేజకు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. గతంలో చేసిన తరహాలోనే ఈ సినిమాలోనూ సెట్‌ల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మోడ్రన్ పాత్రలకు ఆషికా రంగనాథ్ పర్ఫెక్ట్‌గా సరిపోయారు. డింపుల్ హయతి పాటల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. సత్య, సునీల్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ తమ తమ పరిధిలో నవ్వించారు. తారక్ పొన్నప్ప పాత్రకు ఇచ్చిన బిల్డప్ తర్వాత పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
Details
ప్రేక్షకులకు విజ్ఞప్తి
'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో బలమైన కథ, గట్టి కథనం కనిపించదు. రవితేజ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా క్లాసీగా కనిపించారు. ఆషికా రంగనాథ్ గ్లామర్ ఆకట్టుకుంటుంది. సత్య, సునీల్, వెన్నెల కిశోర్ కొంతమేర నవ్విస్తారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే కొన్ని కామెడీ సన్నివేశాలు ఎంజాయ్ చేయొచ్చు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళితే మాత్రం నిరాశ తప్పదు. పార్టుల పార్టులుగా కొన్ని సీన్లు బాగున్నాయంతే.