
Balakrishna: భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న బాలకృష్ణ
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో పాటు వరుస సత్కారాలను సొంతం చేసుకుంటున్నారు. 2025 జనవరి 25న ఆయనకు భారత అత్యున్నత మూడో పురస్కారం అయిన 'పద్మ భూషణ్ అవార్డు' లభించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఆయన మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. యూకేలోని ది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) బాలకృష్ణ పేరును నమోదు చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో హీరోగా 50 ఏళ్ల విశిష్టమైన సినీ ప్రయాణాన్ని గుర్తిస్తూ, ఈ ఆగస్టు 30న ప్రత్యేక సత్కారం అందించనుంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఈ గుర్తింపును పొందిన మొదటి హీరోగా బాలకృష్ణ నిలిచారు. ఆయన అంకితభావం, కళాత్మకతకు ఈ పురస్కారం నిదర్శనం అని నిర్వాహకులు పేర్కొన్నారు.
Details
ఆనందంలో ఫ్యాన్స్
ఈ సందర్భంగా బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "నా తండ్రి నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ హీరోగా 50 సంవత్సరాల ప్రయాణం తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం అందుకోవడం నిజంగా విశేషం. మీరు తెరపై ఒక ఐకాన్, సమాజానికి కరుణామయ నాయకుడు. మీ అద్భుతమైన ప్రయాణానికి లభించిన ఈ ప్రపంచవ్యాప్త గుర్తింపుపై చాలా గర్వంగా ఉంది. మా గర్వం.. మా హీరో మీరని వ్యాఖ్యానించారు.