బెదురులంక 2012 ట్విట్టర్ రివ్యూ: యుగాంతం కాన్సెప్ట్ తో వచ్చిన కథ అకట్టుకుందా?
ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన బెదురులంక 2012 చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజైంది. లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించాడు. కొత్త దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 2012లో యుగాంతం అవుతుందని పుకారు బయటకు వచ్చింది. ఆ పుకారు కారణంగా ఒక ఊరిలో జరిగిన చిత్ర విచిత్రమైన సంఘటనలను ఈ సినిమాలో చూపించారని నెటిజన్లు చెబుతున్నారు. ఫస్టాఫ్ డీసెంట్ గా సాగిందని, అక్కడక్కడా కామెడీ, ఆసక్తి కలిగించే సీన్లతో నిండిపోయిందని అంటున్నారు.సెకండాఫ్ మాత్రం కామెడీ సీన్లతో నిండిపోయిందని చెబుతున్నారు.
సెకండాఫ్ లో కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు
కొత్త దర్శకుడు క్లాక్స్, సీన్లు రాసుకున్న విధానం బాగుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ తో వచ్చే సీన్లు హిలేరియస్ గా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. కార్తికేయ, నేహాశెట్టిల నటన బాగా ఆకట్టుకుంటుందనీ, కార్తికేయకు మంచి కమ్ బ్యాక్ దొరికినట్టేనని అంటున్నారు. సెకండాఫ్ లో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కసిరెడ్డి మధ్య వచ్చే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ సాంగ్స్, నేపథ్య సంగీతం బాగుందని కామెంట్ చేస్తే మరికొందరేమో పాటలు నిరాశ పరిచాయని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే బెదురులంక 2012 సినిమాకు నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.