Page Loader
Khaleja: 'ఖలేజా' సినిమా విడుదల సమయంలో టైటిల్‌పై వివాదం.. రూ.10లక్షలు గోవిందా..!
'ఖలేజా' సినిమా విడుదల సమయంలో టైటిల్‌పై వివాదం.. రూ.10లక్షలు గోవిందా..!

Khaleja: 'ఖలేజా' సినిమా విడుదల సమయంలో టైటిల్‌పై వివాదం.. రూ.10లక్షలు గోవిందా..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు మహేష్ బాబు కథానాయకుడిగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఖలేజా' 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల సమయంలో ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా, మహేశ్‌బాబు తన బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌ను వినూత్న కోణంలో ప్రదర్శించి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అయితే, ఈ చిత్ర టైటిల్‌ సంబంధించి విడుదల సమయంలో ఓ న్యాయపరమైన వివాదం తెరపైకి వచ్చింది.

వివరాలు 

మొదట ఒప్పుకొన్నారు 

'ఖలేజా' అనే టైటిల్‌ను అప్పటికే ఓ వ్యక్తి నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ చిత్ర బృందం అదే టైటిల్‌ను తమ సినిమాకి ఎంచుకున్నట్లు ప్రకటించడంతో, ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించి, ఈ టైటిల్‌తో సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ ఇంట్రిమ్ ఆర్డర్‌ను కోరాడు. న్యాయమూర్తి అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించిన తరువాత స్పందిస్తూ, "ఇప్పటికే చిత్రీకరణ, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మధ్యలో విడుదలను నిలిపివేయడం సరైంది కాదు. మీరు నష్టపరిహారం రూపంలో పరిష్కారం కోరవచ్చు. ఎంత పరిహారం కావాలో చెప్పండి" అని సూచించారు. దాంతో ఆ వ్యక్తి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని అతను కోర్టును కోరాడు.

వివరాలు 

ఆ తర్వాత మాట మార్చారు 

'ఖలేజా' నిర్మాతలు కోర్టులోనే రూ.10 లక్షలు ఇవ్వడానికి అంగీకరించగా,న్యాయమూర్తే స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పారు. అయితే విరామానంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన సమయంలో ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చి, రూ.25 లక్షలు కావాలని పేర్కొన్నాడు. దీంతో కోర్టులో కొంతసేపు వాదనలాటలు చోటు చేసుకున్నాయి.మొదట రూ.10 లక్షలు కోరిన వ్యక్తి తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలియడంతో, వారు స్పందిస్తూ, "ఇప్పుడు పూర్తి విచారణ చేపట్టలేం. తుది తీర్పు ఇవ్వడం సాధ్యపడదు. మరికొన్ని ఆధారాలు అవసరం. అంతవరకూ సినిమాను నిలిపివేయలేం. మీరు అవసరమైన ఆధారాలతో మళ్లీ కోర్టును ఆశ్రయించండి. ప్రస్తుతానికి మీ పిటిషన్‌ను రద్దు చేస్తున్నా" అని తీర్పును వెల్లడించారు. ఈ తీర్పుతో టైటిల్‌ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు.

వివరాలు 

విడుదలైన సినిమా 

ఈ న్యాయవివాదం అనంతరం,చిత్రబృందం"మహేశ్ ఖలేజా"అనే టైటిల్‌తో సినిమాను ఎలాంటి అవాంతరాలు లేకుండా థియేటర్లలో విడుదల చేసింది. అప్పట్లో,టాలీవుడ్‌లో పలు చిత్రాల టైటిల్స్ విషయంలో వివాదాలు చర్చకు మార్గం వేశాయి. ఈ కేసును వాదించిన న్యాయవాది కూడా తరువాతి ఇంటర్వ్యూల్లో ఈ ఘటనను పంచుకున్నారు. టైటిల్ వివాదాలను అధిగమించేందుకు అప్పటి నుంచి దర్శకులు,నిర్మాతలు చాతుర్యంతో హీరో పేరును టైటిల్‌కు ముందు జోడిస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా,పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'ఖలేజా' చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే 30న ఈ సినిమా మళ్లీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు రెడీ అవుతోంది.