బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో నుండి తాజాగా ఖతర్నాక్ అప్డేట్ బయటకు వచ్చింది. మేనమామ, మేనల్లుడు కలిసిన నటిస్తున్న మొదటి సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉండనుందని సమాచారం. ఈ పాటలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో కలిసి స్టెప్పులు వేయడానికి బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాను తీసుకుంటున్నారని వినిపిస్తోంది. ఇదివరకు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ అనే ప్రత్యేక గీతంలో కనిపించింది ఊర్వశి రౌతేలా. ఇప్పుడు బ్రో సినిమా కోసం మరోమారు తెలుగు హీరోల సరసన స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది.
తమిళంలో విజయం సాధించిన సినిమాకు రీమేక్
తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథను తెలుగువారికి తగినట్లుగా మార్పులు చేర్పులు చేశాడు త్రివిక్రమ్. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బ్రో సినిమా విడుదల అవుతుంది.