
Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఒక మహిళా సహాయ కొరియోగ్రాఫర్ (21) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్‌పై ఆదివారం నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఫిర్యాదుదారిణి మొదట రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు.
పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు.
వివరాలు
బాధితురాలి ఫిర్యాదులో ఏముందంటే..
2017లో జానీ మాస్టర్‌తో తన పరిచయం ఏర్పడిందని, 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరారని తెలిపింది.
ముంబైలోని ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జానీ మాస్టర్ హోటల్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
ఈ విషయం ఎవరికైనా చెప్పినపక్షంలో పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ ఉద్యోగం చేయనివ్వబోమని బెదిరించాడని తెలిపింది.
అదే సమయంలో, అతడు ఆమెను ఇతర నగరాలకు తీసుకెళ్లి అక్కడ కూడా అనేకసార్లు లైంగికంగా వేధించాడని, షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది.
వివరాలు
మతం మార్చుకుని.. వివాహం చేసుకోవాలని ఒత్తిడి
ఒక సందర్భంలో లైంగిక వాంఛ తీర్చనందుకు ఆమె జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడని కూడా ఫిర్యాదు చేసింది.
అదేవిధంగా, మతం మార్చుకుని తనతో వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు పేర్కొంది.
చివరకు, జానీ మాస్టర్ బృందాన్ని వదిలివెళ్లినప్పటికీ, అతడు ఇతర ప్రాజెక్టులు రాకుండా తనకు ఇబ్బందులు కలిగించాడని తెలిపింది.
ఆగస్టు 28న ఆమె ఇంటి ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఓ పార్సిల్ ఉంచి వెళ్లాడని, దానిపై 'మగబిడ్డకు అభినందనలు, కానీ జాగ్రత్తగా ఉండు' అని రాసి ఉందని బాధితురాలు ఫిర్యాదులో వివరించింది.