Tamilandu: ఉత్తమ రచనలకు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రకటించిన సీఎం స్టాలిన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సహా వివిధ భాషల్లోని ఉత్తమ రచనలకు ఇకపై తమిళనాడు ప్రభుత్వం ఏటా జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. చెన్నైలో ఆదివారం జరిగిన 'చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్-2026' ముగింపు సభలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. 2025 ఏడాదికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ఖరారు చేసి ప్రకటించే దశలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ జోక్యం వల్ల ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. ఇకపై ఆ పురస్కారాల ప్రదానం జరుగుతుందో లేదో కూడా అనుమానమేనని ఆయన వ్యాఖ్యానించారు. కళలు, సాహిత్య రంగాలకు సంబంధించిన పురస్కారాల్లో రాజకీయ జోక్యం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు.
Details
ప్రతిఏటా జాతీయ పురష్కారాలు
ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పష్టమైన వ్యతిరేకతను వ్యక్తం చేయాలని పలువురు రచయితలు, కళా-సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు తనను కోరారని స్టాలిన్ తెలిపారు. వారి అభ్యర్థన మేరకు వివిధ భారతీయ భాషల్లో వెలువడే ఉత్తమ రచనలకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ఏటా జాతీయ స్థాయి పురస్కారాలను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. తొలి దశగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, బెంగాలీ, మరాఠీ భాషల్లోని ఉత్తమ సాహిత్య కృతులకు ప్రతేడాది 'సెమ్మొళి ఇలక్కియ విరుదు' (విశిష్ట భాషా సాహిత్య పురస్కారం) అందజేయనున్నట్లు తెలిపారు.
Details
పారదర్శకత ఉండేలా చర్యలు
ఈ పురస్కారంతో పాటు ప్రతి రచయితకు రూ.5 లక్షల నగదు బహుమతి కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. రచనల సాహితీ ప్రమాణాలు, ఎంపికలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి భాషకు సంబంధించి ప్రముఖ రచయితలు, ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతలతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.