Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ముఖ్య ఉద్దేశం: దిల్ రాజు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రితో చర్చించిన అంశాలను వివరించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఈ మీటింగ్ ప్రధాన లక్ష్యంగా ఉందని తెలిపారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి కొన్ని విషయాల్లో మార్గదర్శకత్వం అందించారని చెప్పారు.
పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం తప్పుడు అపోహ మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం అవుతామని చెప్పారు.
వివరాలు
ఎఫ్‌డీసీ ద్వారా ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు అందిస్తాం
దిల్ రాజు మాట్లాడుతూ, ''తెలుగు సినీ పరిశ్రమపై తనకున్న దూరదృష్టిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో పంచుకున్నారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తగిన విధంగా మేము అందరం కలిసి పనిచేస్తాం. ఇండియన్ సినిమాలా కాకుండా హాలీవుడ్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్స్ నిర్వహించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై చిత్ర పరిశ్రమ పూర్తిగా చర్చించుకొని, ఎఫ్‌డీసీ ద్వారా ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు అందిస్తాం. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
వివరాలు
ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయం
డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఇటీవల కొన్ని పరిస్థితుల కారణంగా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది.
కానీ, అది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఒక్క వారం తర్వాతే ముఖ్యమంత్రితో సమావేశమయ్యానని చెప్పారు.
ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయం, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు లాంటి విషయాలు చిన్నవని చెప్పారు.
అంతర్జాతీయంగా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని దిల్ రాజు పేర్కొన్నారు.