
Kaantha: పీరియడ్ డ్రామాగా ఎం.కె. త్యాగరాజ భగవతర్.. హీరోగా 'దుల్కర్ సల్మాన్'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం మలయాళ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్, తెలుగులోనూ మంచి ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు. 'మహానటి', 'లక్కీ భాస్కర్' వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో విశేష క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంత'. ఈ సినిమాను రానాకు చెందిన స్పిరిట్ మీడియా భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1950ల నాటి కాలక్రమాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివరాలు
సినిమాకు సంబంధించిన అవుట్‌పుట్ అద్భుతం
ఇదొక బయోపిక్‌గా రూపొందుతుండగా, ఈ కథ మొదటి తమిళ సూపర్‌స్టార్ ఎం.కె. త్యాగరాజ భగవతర్ జీవిత కథ ఆధారంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమాకు సంబంధించిన అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీలోని వర్గాలు చెబుతున్నాయి. 'మహానటి' సినిమా వలే, ఈ సినిమాను కూడా ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను తమ ప్లాట్‌ఫామ్‌కి దక్కించుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
దుల్కర్ సల్మాన్, రానాతో సంప్రదింపులు జరుపుతున్నపలు ఓటీటీ సంస్థలు
ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయని తెలిసింది. నిర్మాతలైన దుల్కర్ సల్మాన్, రానాతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. సాధారణంగా బయోపిక్ సినిమాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరో కథానాయకుడిగా, రానా నిర్మాణంలో రూపొందుతున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఓటీటీ సంస్థలు మరింత ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.