
Rana Daggubati: బెట్టింగ్ కేసులో ఈడీ నోటీసులు.. విచారణకు రానా డుమ్మా!
ఈ వార్తాకథనం ఏంటి
హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారికంగా టేకప్ చేసింది. తాజాగా రానాతో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ వంటి పలువురు సెలబ్రిటీలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. రానాను జూలై 23న విచారణకు రిపోర్ట్ అయ్యేలా ఆదేశించింది. అయితే ఇప్పటికే వరుసగా షూటింగ్‌ల షెడ్యూల్ ఫిక్స్ అయిపోయాయని, అందువల్ల రేపటి విచారణకు హాజరు కాలేనని రానా ఈడీకి తెలియజేశాడు. కొంత గడువు కావాలంటూ కోరాడు. ఈడీ దీనిపై ఇంకా స్పందించలేదు. ప్రస్తుతానికి రానా రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే విచారణకు హాజరుకానున్నాడు.
Details
మంచు లక్ష్మి విచారణకు హాజరయ్యే అవకాశం
మంచు లక్ష్మీ విచారణకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో రానా న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో 'నా అన్వేషణ' యూట్యూబ్ ఛానెల్ చేసిన వరుస వీడియోలతో కలకలం రేగిన విషయం తెలిసిందే. అప్పట్లో రీతూ చౌదరి, విష్ణుప్రియ వంటి వారు విచారణకు హాజరయ్యారు. కానీ తర్వాత ఈ వ్యవహారంపై స్పష్టత రాలేదు. ఆదివారం వరకూ పెద్దగా కదలికలు లేకపోయినా.. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్లంతా 'మాకు తెలియకుండా జరిగింది', 'పర్మిషన్ ఉన్నవే చేశాం' అనే వాదనతో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.