
Mahesh Babu: ప్రముఖ సినీనటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది.
ఈనెల 27వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఆయన హాజరుకావాలని ఆదేశించింది.
హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీల మధ్య జరిగిన లావాదేవీల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
సాయిసూర్య డెవలపర్స్ సంస్థ కోసం మహేశ్ బాబు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అందుకు గానూ ఆయన రూ.5.9కోట్లు రెమ్యునరేషన్‌గా అందుకున్నారు. అందులో ఒక భాగాన్ని నగదు రూపంలో అందుకోగా,మిగతా మొత్తం ఆర్‌టీజీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఈడీ ఇటీవల సాయి సూర్య డెవలపర్స్,సురానా గ్రూప్ సంస్థలపై దాడులు నిర్వహించగా,ఆ సమయంలో లభించిన పత్రాల్లో కొన్ని నిధుల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫీసుల్లో సోదాలు
వాటి ఆధారంగా మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ సంస్థలు పెద్దఎత్తున వెంచర్ ప్రాజెక్టుల పేరిట ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే అంశంపై సైబరాబాద్ పోలీసులు గతంలో సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు.
అంతేగాక, సురానా గ్రూప్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది.
దర్యాప్తులో భాగంగా ఈ నెల 16వ తేదీన రెండు రోజులపాటు ఈడీ అధికారులు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.