Rajinikanth: బస్ కండక్టర్ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకూ.. సూపర్ స్టార్‌డమ్‌కు ప్రతీకగా నిలిచిన రజనీకాంత్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినిమా చరిత్రలో "సూపర్ స్టార్" అని పిలిస్తే, అందరి మనసుల్లో మొదట మెదిలే పేరు రజనీకాంత్. పరిచయం అవసరం లేని మహానటుడైన ఆయన స్టైల్, మాట తీరు, వినయశీలత, సాదాసీదా జీవనశైలి—ఇవి అన్నీ కలసి ఆయనను అగ్రస్థానానికి చేర్చాయి. 75వ పుట్టినరోజు సందర్భంగా రజనీకి దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 1950 డిసెంబర్ 12న బెంగళూరులోని మధ్యతరగతి మారాఠీ కుటుంబంలో శివాజీ రావ్ గైక్వాడ్‌గా జన్మించిన రజనీ చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు అనుభవించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్, తల్లి గృహిణి. చిన్న వయసులోనే తల్లి మరణించడం ఆయన జీవితంలో పెద్ద దెబ్బగా మారింది.
Details
చదువు పూర్తి కాగానే బస్ కండక్టర్ గా ఉద్యోగం
కుటుంబ పరిస్థితులు దెబ్బతినడంతో చదువు పూర్తయ్య వెంటనే బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేపట్టాల్సి వచ్చింది. కానీ నటనపై ఉన్న ఆయన అభిరుచి మాత్రం ఒక్కరోజు కూడా తగ్గలేదు. జీతంలో కొంత సేవ్ చేసి నటనా తరగతుల్లో చేరి తన కలను సాకారం చేసుకునే దారిలో నడిచారు. ఈ దీక్ష ఆయనను చివరికి చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకెళ్లింది. అక్కడే ఆయన జీవితంలో కీలక మలుపు తిప్పిన వ్యక్తి దిగ్గజ దర్శకుడు కే. బాలచందర్. రజనీ నటనను చూసిన ఆయన ఇకపై నీ పేరు రజనీకాంత్... నువ్వు స్టార్ అవుతావంటూ సినీరంగానికి పరిచయం చేశారు.
Details
విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు
ఆ తర్వాత 1975లో విడుదలైన అపూర్వ రాగాలు చిత్రంతో రజనీ మొదటిసారిగా తెరపై కనిపించారు. చిన్న పాత్ర అయినా ఆయన స్టైల్ వెంటనే గుర్తింపు తెచ్చింది. 1975-1978 మధ్య రజనీ 50కిపైగా చిత్రాల్లో నటిస్తూ, నెగటివ్ రోల్స్ నుండి గంభీర పాత్రల వరకు విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1978లో వచ్చిన బైరవి చిత్రం ఆయనకు హీరోగా మంచి పేరు తీసుకుని వచ్చింది. అప్పటి నుంచే 'సూపర్ స్టార్' అనే బిరుదు తమిళనాట మరింత బలపడింది. తరువాత అన్నామలై, మూండు ముగం వంటి చిత్రాలతో ఆయన నటన శక్తి మరింత వెలుగుచూసింది. 1980-1990 దశాబ్దం రజనీ క్రేజ్ అగ్రస్థాయికి చేరిన కాలం.
Details
బాషా చిత్రంలో అరుదైన మైలురాయి
ఆ తర్వాత 1995లో వచ్చిన బాషా చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ మైలురాయి. ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే వంటి డైలాగులు రజనీ స్టార్‌డమ్‌ను కొత్త ఎత్తులకు చేర్చాయి తరువాత శివాజీ (2007), ఎంథిరన్/రోబో (2010), 2.0 (2018) వంటి భీకర స్థాయి సినిమాలతో రజనీ పాన్-ఇండియా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత పేరు సంపాదించారు. హిందీ సినిమాల్లో కూడా నటించి భారతవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. దర్శకుడు ఎస్.పీ. ముత్తురామన్-రజనీ కాంబినేషన్ తమిళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జంటగా పేరు సంపాదించింది.
Details
రూ. 500 కోట్లు వసూలు చేసిన 'జైలర్'
యాక్షన్ ప్రేమికుడైన రజనీ స్టంట్స్‌లో ఎక్కువగా స్వయంగా చేసేవారు. 2011లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, సింగపూర్‌లో చికిత్స అనంతరం తిరిగి తెరపైకి రావడం ఆయన సంకల్పబలానికి నిదర్శనం. 2014లో సోషల్ మీడియాలోకి వచ్చిన రోజే లక్షన్నర ఫాలోవర్లు చేరడం ఆయన గ్లోబల్ ఫేమ్‌ను మరొకసారి నిరూపించింది. జపాన్‌లో ముత్తు సినిమా చేసిన రికార్డులు, ఇటీవల జైలర్ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఆయన చరిష్మా తగ్గలేదని చూపించాయి.
Details
దేశవ్యాప్తంగా రజనీ జన్మదిన వేడుకలు
2025 డిసెంబర్ 12న 75ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీ జన్మదినాన్ని అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. ప్రత్యేక పోస్టర్లు, భారీ కటౌట్లు, సామాజిక సేవ కార్యక్రమాలు, అలాగే ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం నరసింహ/పడయప్ప ప్రత్యేక రీ-రిలీజ్ అన్ని కలిసి ఈ వేడుకను మరింత విశేషంగా మార్చాయి. వయస్సు 75 అయినా, రజనీకాంత్ స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఇంకా అదే ఉత్సాహంతో కొనసాగుతుండటం ఆయన ప్రత్యేకతని మరింత బలపరుస్తోంది.