Rajinikanth: బస్ కండక్టర్ నుంచి వెండితెర సూపర్ స్టార్ వరకు.. రజినీకాంత్ ప్రస్థానం ఇదే!
సినిమా అనేది ఎంతో మందికి ఒక కల. ఆ కలను వెండితెరపై నిజం చేసి, కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తుల్లో రజనీకాంత్ ఒకరు. సాధారణ బస్ కండక్టర్‌గా జీవన ప్రయాణం ప్రారంభించిన ఆయన, తన కష్టం, పట్టుదలతో భారతీయ చలనచిత్రరంగంలో సూపర్ స్టార్ గా ఎదిగారు. శివాజీరావు గైక్వాడ్ అనే అసలుపేరుతో కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని నాచికుప్పం గ్రామంలో మరాఠీ కుటుంబంలో జన్మించిన రజనీకాంత్, చిన్ననాటి నుంచే నటనపై మక్కువను పెంచుకున్నారు. బెంగళూరులో ఆచార్య అకాడమీ, వివేకానంద బాలక్ సంఘ్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో మద్రాసుకు చేరుకున్నారు. కానీ ఆరంభంలో సినిమాల్లో అవకాశం రాకపోవడంతో కుటుంబ భారం చూసేందుకు బస్ కండక్టర్‌గా చేరారు.
1975లో సినీ అరంగేట్రం
ఈ సమయంలోనే నాటకాల్లో పాల్గొనే అవకాశం దొరకడంతో రజినీ నటన కాసేపటికి వెలుగులోకి వచ్చింది. తన నటనకు మెరుగులు దిద్దేందుకు మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. రజనీకాంత్ కె. బాలచందర్ దర్శకత్వంలో 1975లో వచ్చిన అపూర్వరాగమల్ చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించారు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రల్లో మెప్పించిన ఆయన, బాలచందర్ నిర్మించిన నేత్రికన్ చిత్రంతో హీరోగా మారారు. ఇక బాలచందర్ సూచనతో తన పేరును రజినీకాంత్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన బాషా, దళపతి, ముత్తు, పడయప్ప, అరుణాచలం వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
2000లో పద్మభూషణ్ అవార్డు
ఇక 2002 నుంచి రజనీకాంత్‌కు వరుసగా కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో ఆయన శకం ముగిసిందని భావించారు. కానీ 2005లో వచ్చిన చంద్రముఖి చిత్రం అతనికి తిరిగి స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా అభిమానుల పండుగగా మారింది. రజినీ తన స్టైల్, డైలాగ్ డెలివరీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన నటనకు 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందించారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం సంపాదించడంతో పాటు, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ రజనీకాంత్‌ను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకోవడం ఆయన ప్రస్థానానికి ప్రత్యేక ముద్ర వేసింది. సాధారణ వ్యక్తిగా మొదలై, ఎంతో కష్టం, పట్టుదల, నిరంతర శ్రమతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను గెలుచుకున్న రజినీకాంత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.