
Sharwanand: ఫ్యామిలీ హీరో నుంచి నిర్మాతగా శర్వానంద్ - 'ఓమీ' బ్యానర్ గ్రాండ్ లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, ఇప్పుడు నిర్మాతగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఆయన 'ఓమీ' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థను బుధవారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శర్వానంద్ తన భవిష్యత్ ప్రణాళికలను మీడియాతో పంచుకున్నారు. 'ఓమీ' కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని, భవిష్యత్ తరాల కోసం దార్శనికతతో ఆరంభించామని శర్వానంద్ తెలిపారు. నిబద్ధత, మంచి సంకల్పం, బాధ్యతలతో కూడిన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.
Details
వందశాతం సహజమైన కథలను తీసుకొస్తాం
ఈ సంస్థ ద్వారా సృజనాత్మకత, ఐక్యత, సుస్థిరత వంటి విలువలకు ప్రాధాన్యతనిస్తూ, 100 శాతం సహజమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వెండితెరపై చెప్పని కథలను తన నిర్మాణ సంస్థ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తానని శర్వానంద్ అన్నారు. నటీనటులు, సృజనాత్మక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వేదికగా 'ఓమీ' నిలుస్తుందని వివరించారు. సినిమాలు నిర్మించడమే కాకుండా, ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కలిసికట్టుగా అనుభవించే జీవనశైలిని ప్రోత్సహించడమూ తమ ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణంతో సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారని శర్వానంద్ స్పష్టం చేశారు.