Pawan Kalyan : ఊహాగానాలకు ఫుల్‌స్టాప్.. పవన్ ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చేయలేదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు చివరికి స్పష్టత వచ్చింది. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, అవి నిజం కాదని తాజా సమాచారం చెబుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త సినిమా ప్రాజెక్టులకు సంతకం చేయలేదని, పూర్తిగా ప్రజా సేవపైనే దృష్టి పెట్టారని ఆయన టీమ్ వెల్లడించింది. కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏదైనా సినిమా ప్రాజెక్ట్ ఖరారైతే అది అధికారికంగా ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది. అప్పటివరకు వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు సూచించింది.
వివరాలు
అప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఉండదు
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సీక్వెల్‌పై కూడా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అయితే 'OG 2'కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, దాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా సరైన సమయంలో వెల్లడిస్తారని స్పష్టం చేశారు. అప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన ఉండదని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. సినిమా షూటింగ్‌ల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యం ఇస్తున్న ఆయన ఈ దశలో సినిమాలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేరు. కాబట్టి మెగాభిమానులు, జనసైనికులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.