హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు
హాలీవుడ్ రచయిత సంఘం గత మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సంఘీభావం తెలిపింది. మెరుగైన వేతనాల కోసం తాము సైతం సమ్మె బాట పడుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నటీనటులు, రచయితల సమ్మెకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మద్దతు ప్రకటించారు. ప్రపంచ సినీ పరిశ్రమకు హాలీవుడ్ బాహుబలి లాంటిది. భారీ బడ్జెట్ చిత్రాలతో, ఆధునిక సాంకేతికతతో అన్ని దేశాల్లో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. అలాంటి అతిపెద్ద సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సమ్మె జరుగుతోంది. వేతనాలు పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కొనసాగిస్తోంది.
టీవీ షోలు, ఓటీటీ సిరీస్‌లతో నిర్మాణ సంస్థలకు కాసుల పంట
తమ కష్టంతో టీవీ షోలు, ఓటీటీ సిరీస్‌లతో నిర్మాణ సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయని, తమకు కనీసజీతాలు ఇవ్వట్లేదని రచయితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రచయితల సమ్మె జరుగుతున్న క్రమంలోనే శుక్రవారం నుంచి నటీనటుల సంఘం (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ - SAG ) సైతం సమ్మె బాట పట్టింది. వేతన పెంపుదల కోసం నిర్మాణ సంస్థల యూనియన్ AMPTP (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో చర్చించినా ఫలితం దక్కలేదు.ఈ నేపథ్యంలోనే దాదాపు 11వేల మందికిపైగా రైటర్స్ సమ్మె చేస్తున్నారు. మరోవైపు స్టార్ యాక్టర్స్ మినహా సుమారు 80శాతం మేర నటీనటులు సైతం సమ్మెలోకి వచ్చారు. రచయితల మాదిరే తమ సమస్యలు తీర్చాలని యాక్టర్స్ కోరుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్రను తగ్గించాలని డిమాండ్
హాలీవుడ్ చిత్ర నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) పాత్రను తగ్గించాలని నటీనటుల సంఘం పట్టుబట్టింది. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదని, సెట్స్ లో సదుపాయాలు సైతం కల్పించలేదని సమ్మెకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డిశ్చర్ సమ్మె చేస్తున్నట్లు ప్రకటన చేశారు. మరోవైపు హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా వరుస సినిమాలు చేస్తూ విదేశాల్లోనే నివాసం ఉంటోంది. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లో తాజాగా ఆమె సభ్యత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ స్ట్రాంగ్ అంటూ యూనియన్ సహా తోటి నటులకు మద్దతుగా నిలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచి భవిష్యత్ కోసం పోరాడుతున్నామని వెల్లడించింది. ప్రియాంక పోస్టుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.