మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో విశాల్ కు కోర్టులో ఊరట లభించింది. తాను హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమాను విడుదల చేసుకోవచ్చని మద్రాస్ కోర్టు తీర్పునిచ్చింది.
కొన్ని రోజుల క్రితం మార్క్ ఆంటోనీ సినిమా విడుదలపై మద్రాస్ కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం కోర్టులో విశాల్ అనుకూలంగా తీర్పు లభించడంతో మార్క్ ఆంటోనీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, మార్క్ అంటోనీ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదలవుతుందని, హిందీలో 22వ తేదీన విడుదల కానుందని రాసుకొచ్చారు.
ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది.
Details
మార్క్ ఆంటోనీ మీద ఆసక్తి పెంచిన ట్రైలర్
గత కొన్ని రోజులుగా హీరో విశాల్ వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్నాడు. అభిమన్యుడు తర్వాత విశాల్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ప్రస్తుతం మార్క్ ఆంటోనీ సినిమా మీద జనాల్లో ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్, పాటలు బాగుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
అదీగాక సెప్టెంబర్ 15వ తేదీన పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం మార్క్ ఆంటోనీ సినిమాకు కలిసొచ్చే విషయంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా రీతూ వర్మ, అభినయ కనిపిస్తున్నారు, ఎస్ జె సూర్య, సెల్వరాఘవన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.