కళ్యాణ్ రామ్ బర్త్ డే: ఆయన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు
కీ.శే నందమూరి తారకరామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ జీవితం, కెరీర్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఏంటో తెలుసుకుందాం. 2003లో తొలిచూపులోనే అనే సినిమాతో హీరోగా మారాడు కళ్యాణ్ రామ్. అంతకంటే ముందు బాలనటుడిగా బాలగోపాలుడు అనే సినిమాలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. తొలిచూపులోనే సినిమా పరాజయం కావడంతో అభిమన్యు సినిమా చేసాడు. అది కూడా అనుకున్నంత ఆడలేదు. ఆ తర్వాతే నిర్మాణ సంస్థను మొదలెట్టి అతనొక్కడే చిత్రాన్ని తెరకెక్కించాడు.
కొత్త దర్శకులతో పెద్ద హిట్లు
అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీ దర్శకుడూ సురేందర్ రెడ్డి దొరికాడు. అతనొక్కడే మంచి విజయం అందుకుని కళ్యాణ్ రామ్ కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. అతనొక్కడే తర్వాత కూడా వరుసగా పరాజయాలు చవిచూసాడు కళ్యాణ్ రామ్. చాలా రోజుల వరకు సాలిడ్ హిట్ పడలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2015లో వచ్చిన పటాస్ తో మరోమారు ఘనవిజయం అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత 2022లో బింబిసార సినిమాతో కెరీర్ బెస్ట్ వసూళ్ళను అందుకుని సత్తా చాటాడు. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించాడు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నుండి డెవిల్ అనే సినిమా వస్తోంది.
కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్
2006లో కళ్యాణ్ రామ్ వివాహం స్వాతితో జరిగింది. స్వాతి ఒక డాక్టర్. ప్రస్తుతం వీరిద్దరికీ శౌర్యరామ్, తారక అద్వైత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు డాక్టర్ గా సేవలందిస్తూనే ఇటు వీఎఫ్ఎక్స్ సంస్థను నడుపుతున్నారు స్వాతి. బింబిసార వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ భాగం ఆ సంస్థలోనే జరిగింది. నటుడిగా కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు 23సినిమాలు చేసారు. వాటన్నింటిలోకి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో తండ్రి హరికృష్ణ పాత్రలో కనిపించడం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.