హ్యాపీ బర్త్ డే కార్తికేయ: తీసింది తక్కువ సినిమాలే అయినా వైవిధ్యతను చాటుకుంటున్న హీరో
సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు, వైవిధ్యమైన సినిమాలు తీయడం అంత సులభమూ కాదు. ఈ విధంగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ,ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న హీరో కార్తికేయ పుట్టినరోజు ఈ రోజు. ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో హీరోగా పరిచమైన కార్తికేయ, ఆ తర్వాత ఆర్ ఎక్స్ 100 సినిమాతో తిరుగులేని విజయాన్ని పొందాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది. సాధారణంగా హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాక వరుసగా పెట్టి హీరోగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఆర్ ఎక్స్ 100తో విజయం దక్కిన తర్వాత రిస్క్ చేసి నాని నటించిన గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించాడు.
ఉత్తమ విలన్ గా సైమా అవార్డు అందుకున్న హీరో
గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు గాను ఉత్తమ విలన్ గా సైమా అవార్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత గుణ 369, 90ఎమ్ఎల్, చావు కబురు చల్లగా వంటి వైవిధ్యమైన సినిమాల్లో హీరోగా కనిపించాడు. చావు కబురు చల్లగా సినిమా చేయడానికి ధైర్యం కావాలి. ఆ సినిమాలో బస్తీ బాలరాజు తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి కనిపించారు. తెలుగులో హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తూనే తమిళంలోకి కూడా అడుగుపెట్టారు. అజిత్ నటించిన వలిమై సినిమాలో విలన్ గా కార్తికేయ నటించారు. ఆ తర్వాత మళ్ళీ తమిళంలో కార్తికేయ సినిమాలు చేయలేదు.
బెదులంక 2012తో సక్సెస్ అందుకున్న కార్తికేయ
రీసెంట్ గా బెదురులంక 2012 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. 2012లో భూమి అంతం అవుతుందని అనేక పుకార్లు వచ్చాయి. వాటి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, థియేటర్ల మంచి సక్సెస్ అందుకుంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత బెదురులంక సినిమాతో మంచి విజయాన్ని కార్తికేయ అందుకున్నాడు. నేహా శెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమా మూఢ నమ్మకాల చుట్టూ తిరుగుతుంది. దేవుడు, దయ్యం వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమాను చేయడం నిజంగా సాహసం. ఆ సాహసానికి థియేటర్ల వద్ద రెస్పాన్ బాగా వచ్చింది. ఇలా వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న కార్తికేయకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.