హ్యాపీ బర్త్ డే రాజేంద్ర ప్రసాద్: డబ్బింగ్ ఆర్టిస్టుగా మొదలైన రాజేంద్ర ప్రసాద్ సినీ విశేషాలు
రాజేంద్ర ప్రసాద్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. టీవీల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోయే వాళ్ళు ఎంతో మంది. కొంచెం ఒత్తిడిగా ఫీలైతే యూట్యూబ్ లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. తెలుగులో తనకంటూ విలక్షణమైన గుర్తింపును తెచ్చుకున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు ఈరోజు. సీనియర్ ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులో జన్మించిన రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ ప్రభావంతో సినిమాల వైపు మళ్లారు. మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత చెన్నై వెళ్ళి యాక్టింగ్ నేర్చుకున్నారు. అ యితే అవకాశాల కోసం ఎంత తిరిగినా నటించే ఛాన్స్ చాలారోజుల వరకూ రాలేదు.
బాపు సినిమాలో నటుడిగా తొలి అవకాశం
వేషాల కోసం తిరుగుతున్న సమయంలో, కడుపు నింపుకోవడానికి డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మారారు. మొదటిసారిగా మేలుకొలుపు చిత్రంలో తమిళ నటుడికి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో 1977లో బాపు దర్శకత్వంలోని స్నేహం సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. ఆ తర్వాత మూడు ముళ్ళ బంధం, ఛాయ, నిజం సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ మెరిసారు. ఇలా వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తుండగా, 1985లో ప్రేమించు పెళ్ళాడు సినిమాతో రాజేంద్ర ప్రసాద్ ను హీరోగా పెద్ద వంశీ పరిచయం చేసారు. ఈ సినిమా అంతగా ఆడలేదు కానీ ఆ తర్వాత వంశీ తెరకెక్కించిన లేడీస్ టైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సీరియస్ పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు
లేడీస్ టైలర్ తర్వాత ఏప్రిల్ 1 విడుదల, జయమ్ము నిశ్చయమ్మురా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు ఇలా హిట్ల మీద హిట్లు అందుకున్నారు. కెరీర్లో కామెడీ సినిమాలే కాకుండా సీరియస్ పాత్రల్లోనూ కనిపించారు. కాష్మోరా సినిమాలో దార్కా, ముత్యమంత ముద్దు సినిమాలో అనుదీప్ పాత్రలు రాజేంద్ర ప్రసాద్ లోని సీరియస్ నటుడిని పరిచయం చేస్తాయి. తెలుగులోనే కాదు హాలీవుడ్ లోనూ రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఆయన నటించిన క్విక్ గన్ మురుగన్ మూవీ హాలీవుడ్ లో రిలీజైంది. హీరోగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.