హ్యాపీ ఫాదర్స్ డే: తండ్రి గురించి గొప్పగా చూపించే కొన్ని తెలుగు సినిమాలు
తెలుగు సినిమా నటుడు తనికెళ్ళ భరణి, ఒక సందర్భంలో చెప్పినట్టు నాన్న నిజంగా వెనకబడ్డాడు. నాన్న ఎంతో చేస్తాడు, అయినా కూడా నాన్న వెనకబడ్డాడు. అందుకే నాన్న గొప్పదనాన్ని చెప్పే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అమ్మ ప్రేమ, అనురాగం గురించి వచ్చినన్ని సినిమాలు నాన్న మీద రాలేదు. సాధారణంగా నాన్న కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు. నాన్న ఏది చేసినా అది బాధ్యతలో భాగంగా గుర్తిస్తారే తప్ప, మా నాన్న నాకోసం చేసారని అనుకోరు. అందువల్లే నాన్న మీద తక్కువ సినిమాలు వచ్చాయేమో! ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నాన్న గురించి వచ్చిన తక్కువ సినిమాల్లోంచి కొన్ని సినిమాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం.
నాన్న పాత్ర తక్కువగా, నాన్న ఎమోషన్ ఎక్కువగా ఉండే సినిమాలు
సన్నాఫ్ సత్యమూర్తి(2015): అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాన్న చేసిన అప్పులను తీర్చే కొడుగ్గా కనిపిస్తాడు అల్లు అర్జున్. నాన్న మరణించిన తర్వాత కూడా తన నాన్న గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదని తాపత్రయ పడే కొడుకు కథే సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమాల్లో నాన్న పాత్ర తక్కువగా ఉంటుంది. కానీ కొడుకును నడిపించేది నాన్న ఆలోచనలే. నాన్నకు ప్రేమతో(2016): జీవితంలో మోసపోయాననే బాధతో కుమిలిపోతున్న నాన్నలో ఆ ఫీలింగ్ ని తీసివేయడానికి కొడుకు ఏం చేసాడన్నది ఈ సినిమాలో చూపిస్తారు. లవ్, రొమాన్స్ ఉన్నా కూడా ప్రధాన ఎమోషన్ గా నాన్న కనిపిస్తాడు.
తండ్రి పాత్రను గొప్పగా చూపించిన వెంకటేష్ సినిమాలు
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007): వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కోటశ్రీనివాసరావు కనిపిస్తారు. 30ఏళ్ళు వచ్చిన జాబ్ రాక అవస్థలు పడుతున్న కొడుకును పోషించే తండ్రి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా అనగానే రిలేషన్ షిప్స్ లో కొంచెం కృత్రిమత్వం కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు నిజ జీవితంలో జరుగుతున్నట్టుగా ఉంటాయి. నువ్వు నాకు నచ్చావ్(2001): చిన్నతనంలో అమ్మ చనిపోతే నాన్నే అన్ని అయి పెంచుతాడు. అలాంటి నాన్నను వదిలి వెళ్ళడం ఇష్టం లేక పల్లెటూర్లోనే ఉండిపోవాలనే కొడుకు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో నాన్న గురించి వచ్చే డైలాగులు అద్భుతంగా ఉంటాయి.
కొడుకు దృష్టిలో హీరోగా నిలిచిపోయిన నాన్న కథ
జెర్సీ(2019): ఆరేళ్ళ కొడుకు క్రికెట్ జెర్సీ అడిగాడని దాన్ని సాధించడం కోసం ఎన్నో అవస్థలు పడే ఒక క్రికెటర్ అయిన తండ్రి కథే జెర్సీ. ఆరోగ్య సమస్య వల్ల క్రికెట్ మానేసిన యువకుడు, వేరే ఉద్యోగం చేయలేక ఇబ్బందులు పడుతుంటాడు. దాంతో అతని భార్య కూడా అసహ్యించుకుంటుంది. కొడుకు ఒక్కడే హీరోలా చూస్తాడు. కొడుకు దృష్టిలో హీరోగా ఉండడం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టే తండ్రి కథ. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నేచురల్ స్టార్ నాని నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మంచి విజయాన్ని అందుకుంది.