
Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు సినిమా నిలిపివేయాలి.. బీసీ సంఘాలు హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ విడుదల తేదీ సమీపిస్తుండగానే ఈ చిత్రంపై వివాదాలు ముదురుతున్నాయి. తెలంగాణ బీసీ సంఘాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, చరిత్రను వక్రీకరిస్తోందని ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌లో బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో లేని సంఘటనలను కలిపి, కల్పిత కథగా తీర్చిదిద్దిన ఈ సినిమా ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఈ సినిమా కథ వాస్తవానికి తెలంగాణ పోరాట వీరుడు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఉండాలన్నారు.
Details
చరిత్రను వక్రీకరించారు
కానీ చిత్ర నిర్మాతలు, దర్శకులు హరి హర రాయలు, బుక్క రాయల కథగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇది చరిత్రను తారుమారు చేసే ప్రయత్నంగా అభివర్ణించారు. వాస్తవానికి హరి హర రాయల కాలం 1336-1406 మధ్య కాగా, ఔరంగజేబు పరిపాలన 1658-1707 మధ్య జరిగింది. అంటే ఇద్దరి మధ్య సుమారు 300 ఏళ్ల తేడా ఉన్నా, సినిమా ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్‌ను ఔరంగజేబుతో యుద్ధ సీన్స్ లో చూపించడమెలా సమంజసం? అని ప్రశ్నించారు. అంతేకాదు చార్మినార్ నిర్మాణం 1591లో కుతుబ్ షా కాలంలో జరిగినా, ఈ సినిమాలో దానిని హరి హర రాయల కాలానికి చెందినట్లు చూపించడం చరిత్రను పూర్తిగా తారుమారు చేయడమే అని అన్నారు.
Details
పండుగ సాయన్న జీవితాన్ని అపహాస్యం చేయడం మంచిది కాదు
అదే విధంగా హరి హర వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు నుండి తిరిగి తీసుకున్నట్లు చూపించడమూ పూర్తిగా కల్పితమని, చరిత్రలో ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేశారు. దర్శక నిర్మాతలు నిజంగా పండుగ సాయన్న జీవితాన్ని సినిమాగా తీసే ఉద్దేశముంటే తదనుగుణంగా గౌరవంగా, పరిశోధనపూర్వకంగా చిత్రీకరించాల్సిందని బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. కానీ పండుగ సాయన్న పాత్రను మారుస్తూ, కొత్తగా హరి హర వీరమల్లు అనే కల్పిత పాత్రతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాకు శత్రువు కాదు. ఆయనపై గౌరవం ఉంది. కానీ ఈ చిత్రాన్ని తక్షణం నిలిపివేయాలి. చరిత్రను వక్రీకరించడాన్ని తట్టుకోలేం. పండుగ సాయన్న జీవితాన్ని అపహాస్యం చేయడం మంచిదికాదని బీసీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.