కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా నుండి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 సినిమాలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడని ప్రకటన వచ్చింది. ఈ రోజు హీరో సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా, ఇండియన్ 2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ హ్యాండిల్ నుండి హీరో సిద్ధార్థ్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. స్కూటర్ మీద కూర్చున్నట్లు కనిపిస్తున్న సిద్ధార్థ్, భుజానికి బ్యాగ్ వేసుకుని, చెవుల్లో ఇయర్ పాడ్స్ తగిలించుకున్నాడు. అతని జేబుకు త్రివర్ణ పతాకం తళతళా మెరుస్తోంది. ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ పాత్ర కీలకంగా ఉండనుందని అంటున్నారు.
తెలుగులో సినిమాల్లో కనిపించని సిద్ధార్థ్
గతకొన్ని ఏళ్ళుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు హీరో సిద్ధార్థ్. అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు. 2021లో మహాసముద్రం సినిమాలో హీరోగా కనిపించాడు సిద్ధార్థ్. ఇందులో శర్వానంద్ కూడా హీరోగా చేసాడు. అదలా ఉంచితే ఇండియన్ 2 చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోందని సమాచారం. ఇటు రామ్ చరణ్ తో రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు ఇండియన్ 2 పనుల్లో బిజీగా గడుపుతున్నాడు శంకర్. ఇండియన్ 2 చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. సముద్రఖని, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్ మొదలగు వారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇదే సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.