
Ajith Kumar: 'అవమానాలు ఎదురయ్యాయి.. కానీ నేనెన్నడూ ఆగలేదు'.. అజిత్ ఎమోషనల్ నోట్!
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చినా, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలో తన 33 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేసి అభిమానుల్ని ఉద్వేగపరిచారు. సినిమా రంగంలో నా 33 ఏళ్ల ప్రయాణం పూర్తయింది. ప్రతి సంవత్సరం ఓ మైలురాయి. మరో మైలురాయి కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరి ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. ఈ ప్రయాణం ఏ క్షణంలోనూ సులభంగా సాగలేదు. నేను సినీ కుటుంబానికి చెందినవాడిని కాదు. పూర్తిగా బయటి వ్యక్తిగా వచ్చి ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన అన్నారు.
Details
పరాజయాల వెనకే ఎదుగుదల ఉంది
అజిత్ తన నోట్లో ఎన్నో సంక్షోభాలు, విఫల ప్రయోగాలు, మానసిక ఒత్తిడులు ఎదురైనట్లు తెలిపారు. 'జీవితంలోని ఎన్నో ఒత్తిడులు, ధైర్యాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఎప్పుడూ ఆగిపోలేదు. పట్టుదలే నాకు మార్గం. అదే నా బలమని చెప్పారు. సినిమాల్లో ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. ఇక ముందుకు వెళ్లలేను అనుకున్న ప్రతిసారీ మీ ప్రేమే నాకు బలం ఇచ్చింది. నేను ఓడినప్పుడు కూడా మీరంతా నా వెంటే ఉన్నారు. ఇది అత్యంత అరుదైన విశ్వాసం. ఇలాంటి అభిమానులు దక్కటం నా అదృష్టమని పేర్కొన్నారు.
Details
రేసింగ్‌లోనూ అదే లైన్
మోటారు రేసింగ్‌లోనూ ఎంతో కష్టపడ్డాను. గాయాలు అయ్యాయి. నన్ను ఆపేందుకు చాలామంది ప్రయత్నించారు. అవమానించారు. కానీ అన్ని అడ్డంకులను అధిగమించి పతకాలు సాధించాను. ధైర్యంగా ముందడుగు వేస్తే సాధించలేనిది లేదు అనే నిజాన్ని చూపించానని స్పష్టం చేశారు నిజమైన సహచరురాలిగా షాలినీ అజిత్ తన జీవిత భాగస్వామి షాలినీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆమె లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నా వెంటే ఎల్లప్పుడూ నిలిచింది. అభిమానుల ప్రేమను కూడా ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు. ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు.. కానీ మీ ప్రేమను ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నానని అన్నారు.
Details
విమర్శలకూ కృతజ్ఞతలు
ఈ సందర్బంగా అభిమానులకు మాత్రమే కాదు.. విమర్శకులకు కూడా అజిత్ ధన్యవాదాలు చెప్పారు. 'విమర్శలు నాలో తపనను పెంచాయి. ఇంకా బాగుపడాలనే ఆలోచన నాలో నాటుకున్నాయి. మీరు అందరూ అంగీకరించిన ఈ 33 ఏళ్ల ప్రయాణానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ విశ్వాసానికి న్యాయం చేయడం నా బాధ్యత అని పేర్కొన్నారు.