LOADING...
Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు
ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు

Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' (Kannappa) చిత్రం హార్డ్‌డిస్క్ మాయం వ్యవహారం గురించి కథానాయకుడు మంచు విష్ణు మరోసారి స్పష్టత ఇచ్చారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుండగా, ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఇంత గొప్ప సినిమాను పూర్తిచేయడం శివలీల అని భావోద్వేగంగా స్పందించారు. విఎఫ్ఎక్స్ పనుల కోసం మొత్తం 8 వేర్వేరు కంపెనీలు పని చేస్తున్నాయని, వాటిలో ముంబయిలో ఉన్న ఒక కంపెనీ తమ వర్క్‌ను ఆన్‌లైన్‌లో పంపినట్లు చెప్పారు. మొదటగా పంపిన ఫైల్ క్లారిటీగా రాకపోవడంతో మరోసారి అప్‌లోడ్ చేసి పంపారని, అదేకాక హార్డ్‌డిస్క్ రూపంలో ఫిజికల్ కాపీని కూడా ముందుజాగ్రత్త చర్యగా పంపించారని వివరించారు.

Details

హార్డ్‌డిస్క్ ఎవరి చెంత?

అయితే ఈ హార్డ్‌డిస్క్ ఎక్కడికిపోయిందనే ప్రశ్నకి విష్ణు సమాధానం ఇచ్చారు. తమ కంపెనీ జీఎస్టీ అడ్రసు తండ్రి మోహన్‌బాబు ఇంటిదే కాబట్టి అక్కడికి వచ్చిన అన్ని పార్సిళ్లు ఆ ఇంటికే చేరతాయని చెప్పారు. మేనేజర్లు వచ్చిన పేరుల ప్రకారం వాటిని అందజేస్తారని, అందులో రఘు అనే వ్యక్తి ఒక పార్సిల్‌ కోసం చరిత అనే మహిళను సంప్రదించారని తెలిపారు. ఆవిడ హార్డ్‌డిస్క్ తీసుకెళ్లారని, ఆమె ఎవరో కాదు తన సోదరుడు మంచు మనోజ్‌ దగ్గర ఉంటారని తెలిసిందన్నారు. ఆ హార్డ్‌డిస్క్ ఇప్పటికీ తన చేతికి రాలేదని పేర్కొన్నారు. ఇది చాలా కీలకమైన విషయం కావడంతో మధ్యవర్తుల ద్వారా తిరిగి ఇవ్వాలని చెప్పినా నిరాకరించారని, దీంతో చివరికి పోలీసులను ఆశ్రయించామని పేర్కొన్నారు.

Details

 రూ.15 కోట్లు నష్టానికి దారి తీసిన పొరపాటు

పోలీసులకు సంబంధిత సమాచారాన్ని అందించామని, వారు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పాస్‌వర్డ్ ఉండటం వల్ల అది సేఫ్ అనే నమ్మకం ఉంది కానీ, ఏ పాస్‌వర్డ్ అయినా 100 శాతం భద్రంగా ఉండదని గుర్తించాలి. 99 శాతం వరకు మాత్రమే సురక్షితమని విష్ణు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విష్ణు మరో కీలక విషయం వెల్లడించారు. 'కన్నప్ప' భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందని, ఆ మొత్తమంతా ప్రేక్షకులకు తెరపై కనిపిస్తుందని చెప్పారు. వీఎఫ్‌ఎక్స్‌పై ఊహించనంత ఖర్చు చేశామని, దాని కోసం అంత ఖర్చు చేయకూడదు. దీంతో సుమారు రూ.15 కోట్ల నష్టం వాటిల్లిందని విచారం వ్యక్తం చేశారు.ఇది నిజంగా కాస్ట్లీ మిస్టేక్‌ అని వ్యాఖ్యానించారు.