Raashii Khanna: ఒక్కో భాష.. ఒక్కో యాస.. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా: రాశీఖన్నా
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు నటి రాశీ ఖన్నా (Raashii Khanna). హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇలా భిన్న భాషల్లో నటించడం అంత సులభమైన విషయం కాదని రాశీఖన్నా చెబుతున్నారు. ఒక్కో భాషకు సంబంధించిన యాస, ఉచ్చారణ నేర్చుకోవడం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఆమె పేర్కొన్నారు. తాజాగా అభిమానులతో నెట్టింట 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమం ద్వారా ముచ్చటించిన రాశీఖన్నా.. సినిమాల కోసం తాను పడుతున్న కష్టాన్ని పంచుకున్నారు. ఒక్కో సినిమా కోసం కొత్త భాష, దానికి అనుగుణమైన యాస, ఉచ్చారణను నేర్చుకోవాల్సి వస్తుందని తెలిపారు.
వివరాలు
ఆ భాషలో పట్టు సాధించడం ముఖ్యం
'నిజం చెప్పాలంటే నా జీవితమంతా ఓ పరీక్ష రాస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ పరీక్షకు ముగింపు ఉండదు. ఒక సినిమాకు ఒక భాష, దానికి తగ్గ యాస, ఉచ్చారణ నేర్చుకోవాలి.
అది పూర్తవ్వగానే మరో భాషలో ప్రాసను పట్టుకోవాలి. ఈ పరీక్షలకు ఎప్పటికీ 'గ్రాడ్యుయేషన్ డే' ఉండదని రాశీఖన్నా సరదాగా వ్యాఖ్యానించారు.
భిన్నమైన ఇండస్ట్రీల్లో నటిస్తున్నప్పుడు పాత్రలో పూర్తిగా ఒదిగిపోవాలంటే భాష, యాస, ఉచ్చారణపై పట్టు సాధించడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
అందుకే ప్రతి కొత్త ప్రాజెక్ట్ కోసం ఆయా భాషలకు సంబంధించిన అంశాలను నేర్చుకోవడానికి కష్టపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
వివరాలు
చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు
ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ప్రముఖ వెబ్ సిరీస్ 'ఫర్జీ' రెండో సీజన్ (Farzi 2)లో ఆమె నటిస్తున్నారు.
దీంతోపాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా 'ధర్మన్' (Dharman) అనే తమిళ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించే అవకాశం రాశీఖన్నాకు దక్కింది.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మరో హిందీ చిత్రంలోనూ రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆమె నటించనున్నారు. ఇలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో రాశీఖన్నా ప్రస్తుతం బిజీగా ఉన్నారు.