Ilayaraja: 'మన శంకరవరప్రసాద్ గారు'లో ఇళయరాజా పాట.. కాపీ రైట్ వివాదం చెలరేగేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో మ్యూజికల్ కాపీ రైట్స్ అంశంపై సినీ పరిశ్రమలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సంగీత దర్శకులు తాము స్వయంగా రూపొందించిన పాటలను తమ అనుమతి లేకుండా ఇతర సినిమాల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా ముందువరుసలో నిలుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తన సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించారంటూ ఆయన కేసులు, లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది.
Details
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్
అయితే ఈ చిత్రంలో ఇళయరాజా సంగీతం అందించిన 'దళపతి' సినిమాలోని ప్రసిద్ధ గీతం 'సుదరి.. నేనే నీవంట'ను వినియోగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పాటను సినిమాలో నాలుగు చోట్ల ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ అంశమే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో, ఇళయరాజా ఈ సినిమాపై కూడా కేసు వేస్తారా? అనే ప్రశ్న నెటిజన్లలో మొదలైంది. సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఇళయరాజా దృష్టికి ఇంకా చేరలేదా? లేక ఈ పాట వినియోగానికి సంబంధించి చిత్ర నిర్మాతలు ముందుగానే ఆయన అనుమతి తీసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
Details
నోటీసులు పంపిన ఇళయరాజా
ఇంతకు ముందు అజిత్ హీరోగా వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ', మలయాళ హిట్ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్', అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' చిత్రాల్లో తన పాటలను ఉపయోగించినందుకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రజినీకాంత్ తాజా చిత్రం 'కూలీ' టీజర్‌లో తన పాటను వినియోగించిన విషయంపై కూడా ఆయన కేసు వేశారు. ఈ నేపథ్యంలో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విషయంలో ఇళయరాజా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.