'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం
తన పాటతో ప్రపంచ వేదికపై ఉర్రూతలూగించి, తెలుగు ఖ్యాతిని ప్రపంచాన్ని తెలియచేసిన పాటల రచయత చంద్రబోస్ ప్రయాణం 1995లో వచ్చిన "తాజ్ మహాల్" సినిమా నుండి మొదలైంది. తన మొదటి సినిమాతోనే ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబోస్ 28 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో గొప్ప పాటలను అందించారు. తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన చంద్ర బోస్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పట్టాను అందుకున్నారు. మొదట దూర దర్శన్ లో సింగర్ గా ప్రయత్నించి విఫలం అయ్యాక, ఎం.ఎం.కీరవాణి సోదరి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్ని అందించిన తాజ్ మహల్ చిత్రం ద్వారా పాటల రచయతగా మారారు. దాదాపు 850 సినిమాల్లో 3,600పైగా పాటలు రాశారు చంద్రబోస్.
తన పాటలకు రెండు నంది అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ తో అవార్డులు గెలుచుకున్నారు
తాజ్ మహల్ తర్వాత మృగరాజు, స్టూడెంట్ నెం.1, ఆది, ఒకటో నెంబర్ కుర్రాడు, ఠాగోర్, నా ఆటోగ్రాఫ్, మగధీర, షిరిడీ సాయి, రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటల రచయతగా పనిచేశారు. 'నీ నవ్వుల తెల్లదనానికి..' పాటకు, 'చీకటితో వెలుగే చెప్పెను..' పాటలకు నంది అవార్డులు అందుకున్నారు. మనం, రంగస్థలం సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక ప్రపంచ వేదికపై తనను నిలబెట్టిన ఈ పాటకు ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ అవార్డులు గెలుచుకున్నారు.