సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఎంఎం కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత ముప్పై ఏళ్లుగా తన సంగీత ప్రవాహంలో మనల్ని ఉర్రూతలూగిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయన పాటలు అందించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కీరవాణి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటనతో కీరవాణీ ఉప్పొంగిపోయాడు. దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న ఈ పాటకు కీరవాణి ప్రాణం పోశారు. కీరవాణికి ఇప్పటికే గ్లోబ్ అవార్డు, LACFA అవార్డు, ఉత్తమసంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును గెలుచుకొని భారతదేశం గర్వపడేలా చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా 11 నంది అవార్డును గెలుచుకొని రికార్డు సృష్టించాడు.
క్షణం క్షణం మూవీతో కీరవాణికి పెద్ద బ్రేక్
కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ్ కూడా గాయకుడే.. కీరవాణి చిన్న కొడుకు కూడా మత్తు వదలారా సినిమాతో సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు తెలుగు స్వరకర్త కె. చక్రవర్తి, మలయాళ స్వరకర్త సి. రాజమణికి సహాయకుడిగా కీరవాణి తన వృత్తిని ప్రారంభించారు. అతను ఒక సంవత్సరం పాటు ప్రముఖ గేయ రచయిత వేటూరికి కూడా సహాయకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ బ్లాక్ బస్టర్ మూవీ 'క్షణం క్షణం'తో కీరవాణికి పెద్ద బ్రేక్ వచ్చింది. ఇదే అతన్ని సంగీత దర్శకుడిగా స్థిరపరిచింది. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు.