Page Loader
PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సాంకేతికతను మరింత వినియోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో కృత్రిమ మేధ ప్రభావం గురించి ప్రస్తావించారు. తెలంగాణలోని ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో దేశం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికి గర్వకారణమని మోదీ కొనియాడారు.

Details

460 ఉపగ్రహాలు లాంచ్

అంతరిక్ష శాస్త్ర సరిహద్దులను అధిగమించాలనే భారత్‌ సంకల్పానికి ఇది నిదర్శనమని చెప్పారు. గత దశాబ్దంలో దాదాపు 460 ఉపగ్రహాలను లాంచ్‌ చేశామని, ఏటా అంతరిక్ష రంగంలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. చంద్రయాన్‌ విజయంతో భారత్‌ అంతరిక్షం రంగంలో మరింత స్థిరపడిందన్నారు. ఈ రంగంపై యువత ఆసక్తి చూపడం ప్రోత్సాహకరమని చెప్పారు. అలాగే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరుగుతుండటం దేశ విజయాల్లో కీలకమని పేర్కొన్నారు.

Details

కృత్రిమ మేధ వినియోగంపై మోదీ అభిప్రాయాలు 

ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనేందుకు పారిస్‌కు వెళ్లానని, భారత్‌ ఈ రంగంలో సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించిందన్నారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు తొడసం కైలాష్‌ గిరిజన భాషలను పరిరక్షించడంలో కృత్రిమ మేధ సహాయాన్ని వినియోగించారన్నారు. కోలామి భాషలో పాటను కంపోజ్‌ చేయడం ద్వారా ఓ గొప్ప ప్రయత్నం చేశారని ప్రధాని అన్నారు. అంతరిక్షం లేదా కృత్రిమ మేధ వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని మోదీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, వారి జీవితాల్లో స్ఫూర్తినింపేలా ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను మహిళలకు అంకితం చేస్తానని వెల్లడించారు. దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.