తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే మాయాబజార్ విశేషాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమాల జాబితా తీసుకుంటే మొదటి వరుసలో ఉండే సినిమా మాయాబజార్. సినిమా రిలీజై 66ఏళ్ళు అవుతున్నా ఇంకా మాట్లాడుకుంటున్నామంటే, తెలుగు సినిమా మీద, ప్రేక్షకుల మీద ఆ సినిమా చూపిన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి దిగ్గజాలు నటించిన మాయాబజార్, 1957 మార్చ్ 27వ తేదీన రిలీజైంది. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ ప్రొడక్షన్స్ నిర్మించింది. 66ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం మాయాబజార్ కెమెరామెన్ మార్కస్ బార్ట్ లీ.
శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా
గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్ తో సృష్టించిన మాయాజాలాన్ని చూసిన ప్రేక్షకులు నివ్వెరపోయారు. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో, లడ్డూలు అన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ ఎవరూ కదల్చకుండానే వాటికవే కదలడం.. మొదలగు సీన్లను ఎలా తీసారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకుముందు ఇద్దరు పెళ్ళాలు'(1954), సొంతవూరు'(1956) సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తిస్థాయి కృష్ణుడి పాత్రలు కావు. మాయాబజార్ సినిమా టైమ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేసారట.
2లక్షల బడ్జెట్
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేసారు కాబట్టి, ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. కానీ ఎస్వీఆర్ స్వయంగా మాయాబజార్ పెట్టమని సూచించారట. మాయాబజార్ ను సుమారు రెండు లక్షల బడ్జెట్ తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ఇదే. సాధారణంగా 30వేల బడ్జెట్ ను మించి సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ మాయాబజార్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయ ప్రొడక్షన్స్, భారీగా ఖర్చు పెట్టింది. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిన మొదటి చిత్రం ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేసారు. విడుదలైన ప్రతీచోటా విజయాన్ని అందుకుంది.