NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ.. కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయం కావడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఎన్టీఆర్ భుజం గాయం త్వరగా, పూర్తిగా నయం కావాలంటే శస్త్రచికిత్స అవసరమని నిపుణులైన వైద్యుల బృందం నిర్ణయించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
వివరాలు
ప్రస్తుతం నిలకడగా ఆరోగ్య పరిస్థితి..
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
వైద్యుల పర్యవేక్షణలో త్వరలోనే ఆయనకు ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.
ఎన్టీఆర్ దాదాపు 2 నుంచి 3 నెలల వ్యవధిలో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు అంచనా వేస్తున్నారు.
కిమ్స్ ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు సంతకంతో ఈ హెల్త్ బులెటిన్ విడుదలైంది.
ఎన్టీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు స్పష్టం చేయడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.