Kareena Kapoor: ప్రధాని మోదీతో కపూర్ కుటుంబం సమావేశం.. ఆటోగ్రాఫ్ పొందిన కరీనా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కపూర్ కుటుంబ సభ్యులు ఇటీవల ప్రత్యేకంగా కలిశారు. నటి కరీనా కపూర్ తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ప్రధాని నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంలో ఆమె తన తాత రాజ్‌కపూర్ శత జయంతి వేళ ప్రధాని మోదీని కలిసినట్టు తెలిపారు. కరీనా తన పోస్ట్‌లో తమ గ్రాండ్‌ఫాదర్ శత జయంతి వేళ ప్రధానిని ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపింది. తమ తాత జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో మీరు మా కుటుంబానికి ఇచ్చిన మద్దతు మరువలేనిదని ఆమె పేర్కొంది. ఈ వేడుక 14 డిసెంబరు రోజున రాజ్‌కపూర్ జయంతి సందర్భంగా నిర్వహించనున్నారు.
13 నుంచి 15 వరకు వేడుకలు
1924లో జన్మించిన రాజ్‌కపూర్ 1988లో మరణించారు. ఆయన భారతీయ చిత్ర పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన గౌరవార్థం దేశవ్యాప్తంగా 'రాజ్‌కపూర్ 100: సెంటినరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షోమ్యాన్' అనే వేడుకలను 13 నుంచి 15 డిసెంబరు వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన క్లాసిక్ చిత్రాలు ఆగ్, ఆవారా, శ్రీ420, సంగం, బాబీ వంటి 10 సినిమాలను 40 నగరాలలోని 135 థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు ఆర్‌కే ఫిల్మ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్‌ఎఫ్‌డీసీ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.