
Lakshmi Menon: కొచ్చిలో ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. నటి లక్ష్మీ మేనన్‌కు సెప్టెంబర్ 17 వరకు ముందస్తు బెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మీ మేనన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. కేరళ కోర్టు ఆమెకు సెప్టెంబర్ 17 వరకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అప్పటి వరకూ ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు కోర్టు సూచించింది. కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకొని, అతడిపై దాడి చేసినట్లు నటిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమెను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయినప్పటికీ, నటి పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఇంకా చేర్చలేదని తెలిసింది.
వివరాలు
ఘటనపై బాధితుడు ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు
పోలీసుల వివరాల ప్రకారం, ఓ బార్ వద్ద లక్ష్మీ మేనన్, ఐటీ ఉద్యోగి బృందాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపోవడంతో, నటి లక్ష్మీ మేనన్, ఆమె స్నేహితులు ఆ ఐటీ ఉద్యోగిని వెంబడించి అతడి కారును అడ్డగించి, బలవంతంగా తమ కారులోకి ఎక్కించి, దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. నటి లక్ష్మీ మేనన్ 'గజరాజు', 'ఇంద్రుడు', 'చంద్రముఖి 2', 'శబ్దం' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.