ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రానికి తమిళనాడులో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు తమిళనాడులో 7కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ చెబుతోంది. 2023 సంవత్సరానికి గాను తమిళనాడులో ఇంత మొత్తంలో ఒక తెలుగు సినిమాకు కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారని, ప్రస్తుతం తమిళనాడు కలెక్షన్లలో 2023 సంవత్సరానికి గాను ఖుషి టాప్ లో ఉందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలియజేసింది.
తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి 7కోట్ల వసూళ్ళు
తమిళనాడు కలెక్షన్లు తెలుగు, తమిళ వెర్షన్లకు సంబంధించినవని సమాచారం. మరి ఇటు తెలుగు వెర్షన్ కు, అటు తమిళ వెర్షన్ కు సపరేట్ గా ఎంత మేరకు వసూళ్ళు వచ్చాయనే విషయమై చిత్ర బృందం ఎలాంటి వివరాలు వెల్లడి చేయలేదు. మొత్తానికి లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరుకెక్కిన ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంతల నటన ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామక్రిష్ణ ఇతర పాత్రల్లో కనిపించిన ఖుషి సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని సమకూర్చారు.