Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ పై కొత్త వెబ్ సిరీస్..టైటిల్ ఏంటంటే..?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ 31 సంవత్సరాల పంజాబీ గ్యాంగ్‌స్టర్ జైల్లో ఉంటూనే, తన అనుచరుల సహాయంతో తన కార్యకలాపాలను కొనసాగించడం అందరిని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో, అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని త్వరలో ఒక వెబ్‌సిరీస్ రూపొందించనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. 'లారెన్స్.. ఏ గ్యాంగ్‌స్టర్ స్టోరీ' అనే టైటిల్ తో రూపొందించనున్న ఈ సిరీస్‌లో విద్యార్థి నాయకుడి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు,వివిధ దేశాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఏం చేశాడు అనే వాస్తవ ఘటనలతో సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
ప్రేక్షకులను ఆకట్టుకున్న'కరాచీ టు నోయిడా'
ఇటీవల జరిగి బాబా సిద్ధిఖీ హత్యను కూడా ఈ సిరీస్‌లో చూపించే అవకాశముందని తెలుస్తోంది. ఈ టైటిల్‌కు సంబంధించి ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. "ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించాలనుకుంటున్నాము," అని నిర్మాత అమిత్ జానీ తెలిపారు. మరోవైపు, వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రాజెక్టులు రూపొందించడంలో జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌కు మంచి పేరు ఉంది. ఇప్పటికే ఆ బ్యానర్‌పై రూపొందించిన 'ఏ టైలర్ మర్డర్ స్టోరీ' (ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ సాహు కథ), సీమా హైదర్, సచిన్ కథతో 'కరాచీ టు నోయిడా' ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.