మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?
అభిమానులు అందరూ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లో రాబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా మొదలవడానికి ఎన్నో రోజుల సమయం లేదు. మహేష్ తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించినప్పటి నుండి, ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందని అందరూ ఎదురుచూసారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పనుల వల్ల మహేష్ సినిమాను మొదలెట్టడానికి రాజమౌళి ఆలస్యం చేసాడు. ప్రస్తుతం సినిమా మొదలెట్టడానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మహేష్ తో తెరకెక్కించే సినిమా స్క్రిప్టు పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడట. స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. అయినా కూడా ఆగస్టులో సినిమాను ప్రారంభించాలని డిసైడ్ అయ్యారని వినిపిస్తోంది.
పాన్ వరల్డ్ సినిమా
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన, సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలో నటించలేదు. ఆర్ఆర్ఆర్ తో రాజమౌళికి వచ్చిన క్రేజ్ కారణంగా మహేష్ తో తెరకెక్కించే సినిమా పాన్ వరల్డ్ సినిమాగా ఉండనుంది. అదలా ఉంచితే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.