SSMB29: మహేశ్ బాబు-రాజమౌళి ప్రాజెక్టు.. జనవరిలో రెడీ!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజా అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. రాజమౌళి ఈ చిత్రానికి సంక్రాంతి పండుగ తరువాత పూజ కార్యక్రమాలతో కోబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించనున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు నగర శివార్లలో పలు భారీ సెట్లు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.
నటీనటుల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన
తొలి షెడ్యూల్ అందులోనే పూర్తవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మొదలయ్యే షూటింగ్ ఏప్రిల్ వరకు కొనసాగనుంది. తొలి షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే, చిత్రీకరణ విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంతేకాకుండా, ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటుల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. రాజమౌళి త్వరలోనే ప్రెస్‌మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన వివరాలను పంచుకోనున్నట్లు సమాచారం.
రెండు భాగాలుగా చిత్రీకరణ
ఈ సినిమాను వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని, దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు టాక్ ఉంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరాయి. చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ సినిమా నిలిచిపోనుంది.