Cinema Lovers Day: సినిమా ప్రియులకు గుడ్ న్యూస్.. ఏ మల్టీప్లెక్స్ అయినా రూ.99కే సినిమా టిక్కెట్లు
సినిమా లవర్స్ డేను పురస్కరించుకుని ప్రతి ఏడాది మే 31న భారతదేశంలోని అన్నిమల్టీప్లెక్స్ ల్లో రూ.99 లకి ఎంట్రీ ఇస్తున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రకటించింది. PVR ఐనాక్స్, సినీపోలిస్ ఇండియా, మిరాజ్ సినిమాస్, ముల్టా A2,మూవీమాక్స్ లాంటి చైన్లతోపాటు దేశంలో 4 వేలకుపైగా ఉన్న స్క్రీన్లలో ఇదే టికెట్ ధర ఆ రోజు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో చలనచిత్ర వ్యాపారం మందగించిన మొదటి త్రైమాసికం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి,మరోవైపు ఐపీఎల్ కారణంగా ఈ సమ్మర్ లో టాలీవుడ్,బాలీవుడ్ సహా ఎక్కడా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు.
ఆకట్టుకోని చిన్న సినిమాలు
విడుదలైన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా పరిమితంగానే విడుదల కావడంతో టికెట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI)అధిపతి, PVR ఐనాక్స్ పిక్చర్స్ CEO కమల్ జియాంచందానీ మాట్లాడుతూ.. ఈ చైన్ మల్టీప్లెక్స్‌లే కాకుండా దేశంలో నాలుగు వేలకు పైగా ఉన్న ఇతర మల్టీప్లెక్స్‌లలో రూ. 99 కే టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. థియేటర్స్ లో ప్రేక్షకుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, రీక్లైనర్స్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లు ఈ ఆఫర్ నుండి మినహాయించామని, 90-95% సీట్లు ₹99కి అందుబాటులో ఉంటాయన్నారు.
థియేటర్'లో టికెట్ కొంటే జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఛోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ డమ్ యాన్, హైక్యూ ద డంప్ స్టర్ బ్యాటిల్ లాంటి సినిమాలు ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బుక్ మై షో, పేటీయం, అమెజాన్ పే లాంటి ఆన్ లైన్ వేదికల ద్వారా ఈ నెల 31న సినిమా టికెట్లు బుక్ చేసుకొనే వారు రూ. 99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా థియేటర్ లోని కౌంటర్ లో టికెట్ కొంటే మాత్రం జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు. అయితే ఐమ్యాక్స్, రిక్లైనర్ సీట్లకు మాత్రం రూ. 99 టికెట్ ధర వర్తించదు.