మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్
సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్ళి చిత్రం థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏర్పడింది. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని మళ్ళీ పెళ్ళి సినిమాను నిర్మించాడు నరేష్. నరేష్, పవిత్ర మధ్య బంధం గురించి మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్ లో చూపించడంతో సినిమాపై బాగా హైప్ పెరిగింది. కానీ కథనం సరిగ్గా లేకపోవడంతో థియేటర్లలో మళ్ళీ పెళ్ళి సినిమాకు మొదటి షో తర్వాత నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం మళ్ళీ పెళ్ళి సినిమా ఓటీటీలో రిలీజైంది.
మూడు రోజుల్లో 100మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్
అటు ఆహా, ఇటు అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ లలో మళ్ళీ పెళ్ళి విడుదలవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం కేవలం ఆహాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకుల నుండి స్పందన కరువైనా, ఓటీటీలో మాత్రం మళ్ళీ పెళ్ళి సందడి హై రేంజ్ లో ఉంది. రిలీజైన మూడు రోజుల్లోనే వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ విషయాన్ని మళ్ళీ పెళ్ళి టీమ్ అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ అంటే మళ్ళీ పెళ్ళి చూడటానికి జనాలు ఎగబడుతున్నారనే చెప్పాలి. నరేష్ సొంత బ్యానర్ విజయకృష్ణ మూవీస్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.