LOADING...
Manchu Manoj: చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు నటుడు మంచు మనోజ్‌
చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు నటుడు మంచు మనోజ్‌

Manchu Manoj: చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు నటుడు మంచు మనోజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌(Manchu Manoj)చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీని కలిశారు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో, తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి తన అడుగు పెట్టిన సమయంలో జరిగిన ఘటనలపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. తనతో పాటు భార్య మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసు అధికారులను ప్రశ్నించారు. శాంతిభద్రతల పరంగా తిరుపతిని వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు. మోహన్‌బాబు కుటుంబం అంతర్గత కలహాలతో ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు బుధవారం సాయంత్రం మనోజ్‌ దంపతులు తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు.

వివరాలు 

యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు

ఆ సమయంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ''మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి?'' అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్‌ ప్రకారం యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, మనోజ్‌ దంపతులు బందోబస్తు మధ్య తమ తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సమయంలో మనోజ్‌, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితిని క్షణాలలో అదుపు చెయ్యడం వల్ల, ఉద్రిక్తత తగ్గింది.