Manchu Manoj: 'మంచు' ఫ్యామిలీ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు మనోజ్ తండ్రిపై కేసు నమోదు చేయడం, మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి గోడలు తోసుకుని లోపలికి ప్రవేశించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మీడియాతో మోహన్ బాబు ప్రవర్తించిన తీరు, ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ పరిణామాలపై మంచు విష్ణు ఆస్పత్రి నుంచి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి తమ కుటుంబానికి వస్తుందని ఊహించలేదని, మూడు తరాలుగా మా నాన్నగారు ఒక స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.
కుటుంబ విషయాలను బయటికి చెప్పే ఉద్ధేశం లేదు : మంచు విష్ణు
కుటుంబ గొడవలు సాధారణమేనని, నా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమేనని చెప్పారు. మీడియా కూడా కుటుంబాలుంటాయని, కానీ తమ విషయంలో కొందరు హద్దులు దాటారని వెల్లడించారు. తన తండ్రి మోహన్ బాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నాన్నకు దెబ్బలు తగిలాయని, ఈ వార్త తెలిసిన వెంటనే 'కన్నప్ప' మూవీ పనులు వదిలేసి వచ్చానన్నారు. మీడియా వ్యక్తి గాయపడడం చాలా బాధాకరమని, కానీ అది ఉద్దేశపూర్వకంగా జరగలేదని వివరించారు. అనంతరం మనోజ్ ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి విష్ణు నిరాకరించాడు. కుటుంబ అంశాలు బయటకు చెప్పే ఉద్దేశ్యం లేదని, నాన్నగారి ఆస్తి ఆయన ఇష్టమని, ఆయన ఏమి నిర్ణయిస్తే అదే సరైందన్నారు.
నిజాలు త్వరలోనే బయటికొస్తాయి
నిజాలు బయటకు రావటానికి కాలమే సమాధానాలను ఇస్తుందన్నారు. కుటుంబం అంశాలను బయటకు లాగడం సరికాదన్నారు. ప్రేమతో పరిష్కరించాల్సిన విషయాలను రచ్చ చేస్తే సమస్యలు మాత్రమే పెరుగుతాయన్నారు. తాను తమ్ముడిపై దాడి చేయనని వివరించారు.