Salman Khan: సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన సాంగ్‌రైటర్ అరెస్టు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ సారి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తి మెసేజ్ పంపించాడు. ఆ వ్యక్తి సల్మాన్‌ను బెదిరించడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నాడు. వివరాలలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌కు చెందిన సోహెల్ పాషా, ప్రముఖ గేయ రచయిత. తనకు ఫేమ్ రావాలంటే సల్మాన్ ఖాన్‌ను బెదిరించి 5కోట్లు డిమాండ్ చేయడం అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 7వ తేదీన,ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ వాట్సాప్ నెంబర్ ద్వారా బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. ఆ మెసేజ్‌లో,తనను బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన వ్యక్తిగా సూచిస్తూ,"సల్మాన్ 5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాను" అని బెదిరించాడు.
కర్ణాటకకు పోలీసు బృందం
ఆ వ్యక్తి "మై సికందర్ హూ" అనే పాటను రాశాడు. ముంబై పోలీసులు, ఈ మెసేజ్ రాయ్‌చూర్ నుండి వచ్చినట్లు గుర్తించారు. ఈ ఆధారంపై, కర్ణాటకకు ఓ పోలీసు బృందాన్ని పంపించి, ఆ నెంబర్‌ను వెంకటేశ్ నారాయణ్ అనే వ్యక్తి వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, నారాయణ్ ఫోన్‌లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినప్పటికీ, వాట్సాప్ ఓటీపీ నంబర్ అతని ఫోన్‌కు వచ్చిందని పోలీసులు గుర్తించారు. వాస్తవంగా, పాషా స్వయంగా నారాయణ్ ఫోన్ వాడుకుని, ఓటీపీ ద్వారా వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు తేలింది. పోలీసులు,రాయ్‌చూర్ సమీపంలోని మానావి గ్రామంలో సోహెల్ పాషాను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని ముంబైకి తీసుకువెళ్లి, వొర్లీ పోలీసులు విచారిస్తున్నారు.