Netflix Pakistani Content: నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం కీలక ఆదేశం...పాక్ కంటెంట్‌ని బ్లాక్ చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర డిజిటల్ కంటెంట్ భారత్‌లో అందుబాటులో లేకుండా చూడాలని నెట్ ఫ్లిక్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన తొలి పాకిస్థానీ ఒరిజినల్ వెబ్‌సిరీస్ 'జో బచే హై సంగ్ సమేట్ లో' డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సిరీస్ భారత్‌లోనూ స్ట్రీమింగ్ కానుందన్న ప్రచారంతో వచ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాల నేపథ్యంలో కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌ను అప్రమత్తం చేసినట్లు సమాచారం.
Details
పాత ఆదేశాలను గుర్తుచేసిన కేంద్రం
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ పరిస్థితుల్లో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదే ఏడాది మే 8న కీలక అడ్వైజరీ జారీ చేసింది.
భారత్‌లో సేవలు అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా స్ట్రీమింగ్ సంస్థలు, డిజిటల్ మధ్యవర్తులు పాకిస్థాన్ మూలాలున్న కంటెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అందులో స్పష్టం చేసింది.
Details
నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన హామీ ఇదే..
ఈ వ్యవహారంలో నెట్‌ఫ్లిక్స్‌కు గతంలోనే కేంద్రం నుంచి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
2025 జూన్‌లో భారతీయ సబ్‌స్క్రైబర్ల కోసం పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు లేదా సిరీస్‌లను అందుబాటులో ఉంచడం లేదని నెట్‌ఫ్లిక్స్ కేంద్రానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.
ఇప్పుడు అదే హామీకి కట్టుబడి ఉండాలని కేంద్రం మరోసారి గుర్తుచేసినట్లు సమాచారం. ముఖ్యంగా 2025 మే 8న జారీ చేసిన అడ్వైజరీని తప్పనిసరిగా పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది.
Details
ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోంది?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజాశాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్న కంటెంట్‌పై ఓటీటీ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి.
ఈ నేపథ్యంలోనే 'జో బచే హై సంగ్ సమేట్ లో' విడుదలకు ముందు కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌కు తాజా సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ పాకిస్థానీ సిరీస్ భారత్‌లో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.