
#NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా థియేటర్ల అద్దె విధానం (రెంటల్), వసూళ్లపై భాగస్వామ్యం (పర్సంటేజ్) అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను రెండు విధాలుగా విడుదల చేస్తూ వచ్చారు.
పెద్ద సినిమాలను ఎక్కువగా అద్దె పద్ధతిలో విడుదల చేస్తుండగా,చిన్న సినిమాలు లేదా క్రేజ్ తక్కువగా ఉన్న సినిమాలు మాత్రం పర్సంటేజ్ పద్ధతిలో విడుదలవుతున్నాయి.
అయితే మల్టీప్లెక్స్ థియేటర్ల విషయానికి వస్తే, అక్కడ మాత్రం ప్రతీ చిత్రం పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శితమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల మధ్య, సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఒకటై, ఇకపై అన్ని సినిమాలను పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే ప్రదర్శించాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.
వివరాలు
రెంటల్, పర్సంటేజ్ అంటే ఏంటి?
అయితే, 'రెంటల్' అంటే ఏమిటి? 'పర్సంటేజ్' అంటే ఏమిటి? అన్నది చాలా మంది ప్రేక్షకులకు స్పష్టంగా తెలియదు.
అద్దె విధానం ప్రకారం, థియేటర్ యజమాని తన హాలునును చిత్ర నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కు అద్దెకు ఇచ్చినట్లవుతుంది.
ఇదో రకంగా పెళ్లి మండపం అద్దెకు ఇచ్చినట్టే. అయితే పర్సంటేజ్ విధానం వేరుగా ఉంటుంది.
ఇందులో సినిమా టికెట్ల అమ్మకాలను ఆధారంగా చేసుకుని, వాటిలో ఒక శాతాన్ని థియేటర్ యజమానికి, మిగతా భాగాన్ని నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కు అందేలా ఓ ఒప్పందం కుదురుతుంది.
వివరాలు
పెద్ద చిత్రాలు ఎక్కువగా అద్దె విధానంలో..
ఇప్పటివరకు అమలులో ఉన్న విధానం ప్రకారం, పెద్ద చిత్రాలను ఎక్కువగా అద్దె విధానంలో విడుదల చేస్తున్నారు.
అయితే, ఈ విధానం వల్ల తమకు నష్టాలు ఎదురవుతున్నాయని, పర్సంటేజ్ విధానంలో పెద్ద సినిమాలను ప్రదర్శిస్తే తమకూ కొంత లాభం దక్కవచ్చని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు వాదిస్తున్నారు.
చిన్న సినిమాలు ఇప్పటికే పర్సంటేజ్ పద్ధతిలో వస్తున్నా, వాటి వల్ల పెద్దగా లాభాలు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.
అయితే, పర్సంటేజ్ పద్ధతిలో పెద్ద సినిమాలను రిలీజ్ చేయడం సురక్షితమేమీ కాదని, ఇందులో ఎంతో రిస్క్ ఉన్నదని కొందరు ప్రముఖ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
రెంటల్ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్న కొందరు నిర్మాతలు
వాస్తవానికి ఈరెండు విధానాల్లోనూ స్వల్ప వ్యత్యాసాలు ఉన్నా,లాభనష్టాల పరంగా రెండింటికీ తమదైన ప్రాముఖ్యత ఉంది.
కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు మాత్రం ఇకపై పూర్తిగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
దీనికి కారణంగా కొన్ని ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి.ముఖ్యంగా కొందరు నిర్మాతలు రెంటల్ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలు వాస్తవంగా ఎంతవరకు నిజమో అనే దానిపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.
పరిస్థితి ఇంత తీవ్రమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా విచారణకు ఆదేశించాల్సిన స్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 'రిటర్న్ గిఫ్ట్' పేరిట సినీ పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ వ్యవహారాన్ని మరింత ఉద్రిక్తతకు గురిచేశారు.