ఓటీటీలోకి వచ్చేసిన స్పై: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై మూవీ, థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై ఈ సినిమా రూపొందింది. కథ బాగానే ఉన్నా ఆకట్టుకునే కథనం ఆకట్టుకునేలా లేకపోవడంతో థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చాలా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో గత రాత్రి 12 గంటల నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో స్పై సినిమాను మిస్ అయిన వారు ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడవచ్చు.
ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులో ఉన్న స్పై
తెలుగు,తమిళం,కన్నడ మలయాళం హిందీ భాషల్లో స్పై సినిమా అందుబాటులో ఉంది. కార్తికేయ, 18 పేజెస్ వంటి హిట్ల తర్వాత నిఖిల్ నుండి వచ్చిన స్పై సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్లను స్పై సినిమా తెచ్చి పెట్టింది. కానీ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆ తర్వాత రోజుల్లో కలెక్షన్స్ విపరీతంగా తగ్గిపోయాయి. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. సాన్యా ఠాకూర్, అభినవ్ గొమటం, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా సంగీతాన్ని అందించారు.