NTR: ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్.. అందుకే ఆ టైటిల్ పెట్టాం: ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన తాజా చిత్రం 'దేవర' (Devara) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తారక్ (NTR) తన చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. సినిమా విడుదల సమీపిస్తుండటంతో కొంత టెన్షన్ ఉన్నప్పటికీ, చిత్రంపై ఆయనకు గట్టి నమ్మకం ఉందన్నారు. టీమ్ మొత్తం కష్టపడి పని చేసిందని చెప్పారు.
ఏఆర్ రెహమాన్ స్థాయికి అనిరుధ్:ఎన్టీఆర్
అనిరుధ్ (Anirudh) సంగీతంపై ప్రశంసలు కురిపిస్తూ, ''అనిరుధ్ సంగీతం అదుర్స్..అని ప్రస్తుతం అనిరుధ్ కాలం నడుస్తోందన్నారు. కొందరు విజయాన్ని పొందిన తర్వాత వివిధ కారణాల వల్ల వెనుకపడతారు, కానీ అనిరుధ్ అలా కాదు.. ఒక సినిమాకు సంగీతం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసు. అతను అద్భుతమైన వ్యక్తి. ఫలితం అనుకున్నట్లు వచ్చేవరకు కష్టపడతాడు. జైలర్, విక్రమ్, మాస్టర్ వంటి సినిమాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. అనిరుధ్ కూడా ఏఆర్ రెహమాన్ స్థాయికి చేరుకుంటాడు. అంతర్జాతీయ చిత్రాలకు సంగీతం అందిస్తాడు'' అని అన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) తరహాలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యే టైటిల్ ఇవ్వాలని భావించి 'దేవర'ను ఫైనల్ చేశామని తెలిపారు. 'దేవర' అంటే దేవుడు అని చెప్పారు.
జాన్వీ అద్భుతంగా యాక్ట్ చేసింది : ఎన్టీఆర్
కాస్టింగ్ గురించి మాట్లాడుతూ.. కథ రాస్తున్న సమయంలో కథానాయిక ఎవరు అన్నదానిపై ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. ''ఆ సమయంలో కరణ్ జోహార్ ఫోన్ చేసి, జాన్వీ కపూర్(Janhvi Kapoor) మంచి నటి, ఆమెను తీసుకుంటే బాగుంటుందని సూచించారు. మొదట ఆమెను తీసుకోవాలని మేము అనుకోలేదు. కానీ జాన్వీ స్వయంగా ఈ చిత్రంలో భాగం కావాలని కోరుకున్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యే సమయానికి ఆమె టీమ్‌లో చేరారు. యాక్టింగ్, భాష విషయంలో మొదట జాన్వీ కంగారుపడ్డారు కానీ, అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆమె నటనతో మేము ఆశ్చర్యపోయాము'' అని తెలిపారు.
రెండు భాగాలుగా దేవర
ఇది 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న చిత్రం.ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా,సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. 'దేవర' రెండు భాగాలుగా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.