
Vijay Deverakonda:'బయటవారే బాలీవుడ్‌ను నిలబెడతారు'.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
హిందీ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న తాజా సమస్యలపై నటుడు విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయని, బాలీవుడ్ కూడా త్వరలోనే తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతోమంది కృషి ఉందని ఆయన పేర్కొన్నారు. ''ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమ అత్యున్నత స్థాయిలో రాణిస్తోంది.
ఇప్పుడు మా సినిమాలకు దేశ విదేశాల్లో గుర్తింపు ఉంది. కానీ, ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు.
ఇది సర్కిల్‌లాంటిది. మరో ఐదు లేదా పదేళ్లలో పరిస్థితులు మళ్లీ మారవచ్చని విజయ్ చెప్పారు.
Details
'బాహుబలి' మార్గాన్ని సూచించింది
బాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక లోటు కనిపిస్తోంది. అయితే, త్వరలోనే కొత్త దర్శకులు ఆ లోటును భర్తీ చేస్తారని అనుకుంటున్నా. కానీ, వారిలో ముంబయికి సంబంధం లేని వ్యక్తులే ఎక్కువగా ఉంటారని తన అభిప్రాయమని విజయ్ దేవరకొండ తెలిపారు.
'బాహుబలి' సినిమాను ఉదాహరణగా పేర్కొంటూ, తెలుగు సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెంచే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారని విజయ్ తెలిపారు.
అప్పుడు బాలీవుడ్ వాళ్లు ఇక్కడ ఇలాంటి సినిమా వస్తుందని ఊహించి ఉండకపోవచ్చని, ఈ చిత్రం విజయం సాధించకపోతే ఎంతోమంది కెరీర్లు ముగిసిపోయేవని, నిర్మాతలు భారీ నష్టాల్లో కూరుకుపోయేవారని వెల్లడించారు.
Details
పోటీ ఎక్కడైనా ఉంటుంది
నటీనటులు సుమారు ఐదు సంవత్సరాలు తమ జీవితాన్ని ఈ సినిమాకు అంకితం చేశారు. పోటీ ఎక్కడైనా ఉంటుందన్నారు.
అందరూ తమ స్థానం కోసం పోరాడాలి. హిందీ చిత్రపరిశ్రమ కూడా తన దారి కనుగొని, తిరిగి బలంగా ముందుకు సాగుతుందని నమ్ముతున్నానని విజయ్ వివరించారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.