
Humaira Asghar Ali: పాకిస్థానీ నటి హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద మృతి.. కరాచీలోని తన ఫ్లాట్‌లో శవమై
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె కరాచీలోని డిఫెన్స్ ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో శవమై కన్పించారు. వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా హుమైరా ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత మూడు వారాలుగా ఆమె ఎవరూ చూడకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
సహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలుమార్లు తలుపు తట్టినా ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు తలుపును బలవంతంగా విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అందులో హుమైరా మృతదేహం చాలా వరకు కుళ్లిపోయిన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని, ప్రస్తుతం దీన్ని సహజ మరణంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే తెలుస్తాయని తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, హుమైరా అస్గర్ అలీ పాకిస్థానీ టెలివిజన్‌లో 'తమాషా ఘర్' అనే రియాలిటీ షోతో పాటు 'జలైబీ' సినిమాతో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.