Happy birthday Pawan Kalyan: చిరంజీవి తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం దాకా పవన్ ప్రస్థానం
పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. మెగా అభిమానులకు తారకమంత్రం. డైలాగుల వర్షం కురిపించకపోయినా, భీకరమైన డ్యాన్సులతో ప్రేక్షకులను మెప్పించకపోయినా, ఆయన తెరపై కనిపిస్తే చాలు,అభిమానులు పులకరించిపోతారు. ఆయనలోని వినమ్రత,సరళ జీవన శైలి,సాటి మనిషికి సహాయం చేసే గుణం... ఇవే పవన్‌ను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. సామాన్యులే కాదు, ప్రముఖులుకూడా ఆయన అభిమానులే.సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు,ఈ రోజు ఆయన అభిమానులకు ఓ పండుగ. 1968 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు,అంజనా దేవి దంపతులకు పవన్ మూడో కుమారుడిగా జన్మించారు. వెంకట్రావు ఒక సాధారణ కానిస్టేబుల్,వృత్తి రీత్యా తరచూ బదిలీలు ఎదుర్కొన్నారాయన. అందువల్ల పవన్ వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఆ ప్రాంతాల సంస్కృతులు,ప్రజల జీవన విధానాలను గమనించేవారు.
అన్నయ్య చిరంజీవి స్ఫూర్తితో నటనలో శిక్షణ
బాల్యంలో ఆస్తమాతో బాధపడిన పవన్, తండ్రి సరిపడా జీతంతోనే కుటుంబాన్ని నడిపే పరిస్థితుల్లో కష్టాల పాలయ్యారు. అప్పటి కష్టాలను గుర్తుచేసుకుంటూ పవన్, హీరోగా ఎదిగిన తర్వాత పేదల అభ్యున్నతికి తన వంతు కృషి చేశారు. పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినప్పటికీ, అన్నయ్య చిరంజీవి స్ఫూర్తితో నటనలో శిక్షణ తీసుకొని "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు. ఆ తరవాత, ఆయన నటన, వినయంతో ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో విజయాలు సాధించారు. ఉన్నత చదువులు చదువుకోపోయిన.. విద్యను సవాల్‌గా తీసుకుని, పవన్ వివిధ రంగాల్లో పట్టు సాధించాలని కృషి చేశారు. కర్ణాటక సంగీతం, పారా గ్లైడింగ్ వంటి వైవిధ్యమైన విద్యల్లో నైపుణ్యం సంపాదించారు.
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా..
రాజకీయ రంగంలో కూడా పవన్ ప్రభావం చూపించారు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర పోషించి, తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. జనసేన ద్వారా అణగారిన వర్గాల నుంచి నాయకులను తీర్చిదిద్దారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కీలకపాత్ర పోషించి, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సుమారు రూ.165 కోట్ల ఆస్తులు సంపాదించారు. జన్వాడ, మంగళగిరి, హైదరాబాద్‌లలో స్థిరాస్తులు, విలాసవంతమైన కార్లు, బైకులు వంటి ఆస్తులను కలిగి ఉన్నారు.
పదిమందికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలకు సొంత సంపద
రాజకీయాల్లో పవన్ సంపాదించిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు కాకుండా, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ, తన సొంత సంపదను పదిమందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. "గబ్బర్ సింగ్" సినిమాలో చెప్పినట్లుగా పవన్ ట్రెండ్ ను ఫాలో కాకుండా, తనదైన ట్రెండ్ ను సృష్టించాడు. పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోందితెలుగు న్యూస్ బైట్స్ .